
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జైలవకుశ చిత్రం భారీ అంచనాలతో ఈ గురువారం రిలీజ్ అవుతోంది. అంచనాలకు తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని వాణిజ్య వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కలెక్షన్ల ధాటికి గత నాన్ బాహుబలి రికార్డులు బద్ధలవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక జైలవకుశ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతాయని అంటున్నారు.
ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం, టీజర్, ట్రైలర్స్ ఈ చిత్రంపై అంచనాల్ని మరింత పెంచాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో జై పాత్ర విపరీతంగా ఆకట్టుకోవడంతోపాటు భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం తొలిసారి అంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వసూల్ చేస్తుందని చెబుతున్నారు. ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో.. అటు ఓవర్సీస్ లోను అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో అక్కడ కూడా విపరీతంగా కలెక్షన్లు వసూల్ అవుతాయని తెలుస్తుంది. ప్రీమియర్స్ ద్వారానే దాదాపు మిలియన్ డాలర్‌కి చేరువలో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
బాహుబలి తర్వాత జై లవకుశ అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2400 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది. కేవలం హైదరాబాద్‌లోనే 100 స్క్రీన్లలో ప్రదర్శించబడటం ఓ రికార్డు అని చెప్పవచ్చు.
ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం... జై లవకుశ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 24 నుంచి 25 కోట్ల షేర్ దక్కించుకుంటుందని వాణిజ్య వర్గాల్లో ఓ అంచనా. ఆదే నిజమైతే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 100వ చిత్రం ఖైదీ నం. 150 తో నాన్ బాహుబలి రికార్డ్ పటా పంచెలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక పక్క రాష్ట్రమైన కర్ణాటకలోనూ ఎన్టీఆర్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తాయని... అలాగే రెస్టాఫ్ ఇండియాలో కూడా డీసెంట్ కలెక్షన్లు నమోదు కావచ్చని చెప్తున్నారు.
మొత్తంగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ. 30 నుంచి 31 కోట్లు షేర్ కలెక్ట్ చేయవచ్చని వాణిజ్య వర్గాల అంచనా. ఈ లెక్కన తొలిసారి రూ. 50 కోట్ల గ్రాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే గనక నిజమైతే... గత రికార్డులన్నీ పటాపంచలైనట్లే. మరి ఆ వాణిజ్య నివేదిక ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.