
అల్లు అర్జున్ నటించిన `పుష్ప` సినిమా పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు పార్ట్ 2ని తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమవుతుంది. అనేక కారణాలతో తరచూ ఆగిపోవడం, మళ్లీ షూటింగ్ చేయడం జరుగుతుంది. స్క్రిప్ట్ పరంగా, లొకేషన్ల పరంగా, దీనికితోడు డేట్స్, పండగలు, ఇతర ఆకేషన్లకి షూటింగ్ ఆపేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో చాలా నెమ్మదిగా సాగుతుంది.
ఇదిలా ఉంటే ఇటీవల సినిమాలో కీలక పాత్రలో కేశవగా నటించిన జగదీష్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని వేధించి, ఆత్మహత్యకు కారణమయ్యాడనేదానికి సంబంధించిన కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన నేరం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దీంతో జైల్లో మగ్గుతున్నాడు. అయితే `పుష్ప2` సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. జగదీష్ తో వచ్చే సీన్లు చాలా ఉన్నాయి. ఆయన అరెస్ట్ కావడం యూనిట్‌కి పెద్ద తలనొప్పిగా మారింది.
ఆ పాత్రకి మరెవ్వరినీ తీసుకోవడానికి లేదు. అంతగా ఎస్టాబ్లిష్ అయి పాత్ర అది. మార్చితే సినిమా లుక్ మారిపోతుంది. దీంతో ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. తాజాగా టీమ్ జగదీష్‌ని బెయిల్‌పై తీసుకొచ్చారట. నేటి నుంచి షూటింగ్ చేయబోతున్నారట. రామోజీ ఫిల్మ్ సిటీలో జాతర సీన్లు చిత్రీకరిస్తున్నారట. ఇందులో కొన్ని కీలకమైన సీన్లతోపాటు యాక్షన్ సీన్లని చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇందులో జగదీష్ అలియా కేశవ పాల్గొంటాడని సమాచారం. అతను ఉన్న సీన్లు వేగంగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్.. పుష్పరాజ్‌గా రచ్చ చేయబోతున్నారు. ఆయనకు జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తుంది. ఫహద్ పాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఇక మొదటి పార్ట్ లో `ఊ అంటావా మావ` పాట ఎంతగానే ఊపేసింది. ఇందులోనూ అలాంటి ఐటెమ్ సాంగ్ పెట్టబోతున్నారు. ఇందుకు కృతి సనన్, దిశా పటానీల పేర్లు వినిపిస్తున్నాయి.