
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ యజమానులుగా ఉన్న నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలో కూడా కేంద్ర జీఎస్టీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో దాదాపు 15 చోట్ల అధికారులు సోదాలు జరుపుతున్నారు. సంస్థకు చెందిన లావాదేవీలు, ఆదాయపు పన్ను చెల్లింపుల వివరాలను ఆరా తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్.. టాలీవుడ్‌లో పలు హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కార్ వారి పాట వంటి హిట్ చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చినవే. సంక్రాతికి విడుదల కానున్న భారీ బడ్జెట్ చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థనే నిర్మిస్తుంది.
టాలీవుడ్‌లో చాలా మంది పెద్ద హీరోలతో మైత్రి మేకర్స్ చిత్రాలు నిర్మిస్తోంది. మరోవైపు ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. అలాగే పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మైత్రి సంస్థ నిర్మించనున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం పూజ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. జూనియర్ ఎన్టీఆర్ 31 చిత్రాన్ని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. అలాగే మైత్రి సంస్థ కొంత మంది స్టార్ హీరోలకు, క్రేజీ డైరెక్టర్‌లకు కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్‌లు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్‌పై సోదాలు జరగడం తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.