
ఎన్టీఆర్... ఈ మూడు అక్షరాలు బాలకృష్ణకు పూనకం తెప్పిస్తాయి. బాలయ్య వేదికలపై నాన్న గురించి హోరెత్తిస్తారు.ఆయన యుగపురుడు, కారణజన్ముడు,తెలుగు జాతి గౌరవం... ఇలా గొప్ప గొప్ప పదాలతో ఎవరెస్టు శిఖరం మీద కూర్చోబెడతారు. ఒక విధంగా చెప్పాలంటే మనుష్య రూపేణా భూమి మీద తిరుగాడిన దేవుడిగా ఎన్టీఆర్ ని బాలయ్య అభివర్ణిస్తారు. అందులో ఏమాత్రం తప్పులేదు. ఎన్టీఆర్ జన్మనిచ్చిన తండ్రి, సూపర్ స్టార్ గా వెండితెరను ఏలిన కథానాయకుడు. సీఎం పీఠం అధిరోహించిన మహానాయకుడు. ఎలివేషన్స్ వరకు ఓకే. మరి రియాలిటీ ఏంటి.
దేవుడు నిర్ణయాలు తప్పవుతాయా? కారణజన్ముడు కూడా తప్పటడులు వేస్తాడా? లక్ష్మీ పార్వతిని పెళ్లాడాకా? రెండోసారి సీఎం అయ్యాక ఎన్టీఆర్ కానివాడు ఎలా అయ్యాడు?. వీటికే బాలకృష్ణ సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని లక్ష్మీ పార్వతి కోసం నాశనం చేస్తున్నాడన్న నెపంతో ఆయనకు వ్యతిరేకంగా బాబు ఎమ్మెల్యేలను కూడగట్టాడు. కోర్టులు, జడ్జీల సహాయంతో పదవీచిత్యుడు చేశాడు. అనుకూల పత్రికల్లో అసమర్థుడిగా చిత్రీకరించారు. ఇవ్వన్నీ బాలయ్యతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో, సహకారంతో చేసినట్లు మరోసారి రుజువైంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా బాలకృష్ణ బావ నారా చంద్రబాబు నాయుడిని పిలిచాడు. ప్రణాళిక ప్రకారమే 1995లో రాజకీయ సంక్షోభం చర్చకు తెచ్చారు. మీరు తప్పు చేస్తున్నారు, అలా చేయవద్దని ఎన్టీఆర్ ని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడాను. ఆయన వినకపోతేనే మనం ఆయన్ని గద్దె దింపాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఒక వ్యక్తిగా అడుగుతున్నా.. మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అని అన్ స్టాపబుల్ షోలో బాలయ్యను బాబు అడిగారు.
దానికి బాలయ్య సమాధానం... కాదని సైగ చేస్తూ ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది అన్నారు. కాబట్టి ఎన్టీఆర్ ని దించి బాబు సీఎం సీటులో కూర్చోబెట్టాలనే ప్రణాళికలో బాలయ్య హస్తం కూడా ఉంది. బాలయ్యతో పాటు బాబు దీనికి ప్రణాళిక వేశాడు. ఈ షోలో బాబు స్పష్టంగా చెప్పారు, అది మన నిర్ణయం అని, నా నిర్ణయం అనలేదు. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టినా, చెప్పుల దాడి చేయించినా, పత్రికల్లో అసభ్యకర కార్టూన్స్ తో ఆయన పరువు తీసినా బాలయ్య ప్రమేయం కూడా ఉందని నమ్మాలేమో.
మొత్తంగా బావపై ఉన్న వెన్నుపోటు అపవాదు ఎలా పోగొట్టాలని బాధపడుతున్న బాలయ్యకు అన్ స్టాపబుల్ వేదిక అయ్యింది. 1995లో ఎన్టీఆర్ ని పదవికి దూరం చేయడం పార్టీ, ప్రజా సంక్షేమం కోసమే తప్ప, బాబుకి సీఎం అవ్వాలని ఏ కోశాన లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా క్రీస్తు పూర్వం చరిత్ర కాదు. యూట్యూబ్ లో కొట్టినా వీడియోలు వస్తాయి. అప్పటి హైడ్రామా చూసిన జనరేషన్ ఇంకా బ్రతికే ఉంది.బాబు, బాలయ్య ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు. పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ ఈ వివాదానికి ఎలాంటి ముగింపు ఇచ్చారో తెలియదు.