
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారి పేర్లని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొందరు ప్రముఖులు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వారిలో కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య కూడా ఉన్నాడు.
అంతరించిపోతున్న కిన్నెర కళని దర్శనం మొగిలయ్య ఈ తరం వారికి పరిచయం చేస్తున్నాడు కిన్నెర కళతో ప్రజలని ఆకట్టుకుంటున్నాడు. దర్శనం మొగిలయ్య ఇంత పాపులర్ కావడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రమే అని చెప్పాలి.
భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ లోని ప్రారంభ లిరిక్స్ ని సంగీత దర్శకుడు తమన్ మొగియ్య చేత పాడించారు. తన కిన్నెర కళతో 'ఆడగాదు ఈడ గాదు అమీరోళ్ల మేడ కాదు' అంటూ మొగిలయ్య అద్భుతంగా పాడారు. దీనితో కిన్నెర కళలోని మాధుర్యం ప్రతి ఒక్కరికి తెలిసొచ్చింది. ఈ పాటలో మొగిలయ్య ఒక్కసారిగా సెలెబ్రిటీలాగా మారిపోయారు. టివి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మొగిలయ్య ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డాయి.
దీనితో మొగిలయ్య మరింత పాపులర్ అయ్యారు. భీమ్లా నాయక్ సాంగ్ విడుదలయ్యాక పవన్ కళ్యాణ్ ఆయనకి ఆర్థిక సాయం కూడా అందించిన సంగతి తెలిసిందే. అలా మొగిలయ్య తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో పడ్డాడు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మొగిలయ్యని పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేశారు. దీనితో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది.
అయితే మొగిలయ్య పద్మశ్రీ క్రెడిట్ ఎవరిది అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ జరుగుతోంది. అంతా పవన్ కళ్యాణ్ వల్లే అని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇందులో పవన్ చేసింది ఏముంది అని అంటున్నారు. మొగిలయ్యని పద్మశ్రీ కోసం సిఫార్సు చేసింది కేసీఆర్. కాబట్టి ఆ క్రెడిట్ తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అని అంటున్నారు.
కానీ మొగిలయ్యకి ఆ స్థాయిలో గుర్తింపు లభించడానికి, కేసీఆర్ దృష్టిలో పడడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణం అని అంటున్నారు.సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో.. మొగిలయ్య కళని మొదట గుర్తించింది పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఆయన చేత ఓ పాట పాడించాలని పవన్ త్రివిక్రమ్ ని కోరినట్లు చెప్పుకొచ్చారు.