
'కాంతార' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.. తన సొంత ఊరైన ఉడిపి జిల్లా కుందాపురలో సముద్ర తీరానికి దగ్గరగా ఓ అద్భుతమైన ఇల్లు కట్టుకున్నారు. రిపోర్టుల ప్రకారం, ఈ బంగ్లా విలువ సుమారు 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రకృతి నడుమ ఉన్న ఈ ఇంటి నుంచి అరేబియా సముద్రం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రముఖ మరవంతె బీచ్ కూడా ఈ ఇంటికి దగ్గర్లోనే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ స్థలం ఒకప్పుడు వాళ్ల ముత్తాత మేనమామది అట. ఇప్పుడు అదే స్థలంలో పాతతరం వాసనలు పోకుండా, కొత్త హంగులతో రిషబ్ ఈ ఇంటిని తీర్చిదిద్దారు.
పాతకాలం సంప్రదాయం, కొత్తకాలం సౌకర్యాలు కలగలిపి ఈ బంగ్లాను డిజైన్ చేశారు. ఇంటికి స్వాగతం పలుకుతూ పెద్ద పెద్ద లేటరైట్ (ఎర్ర రాయి) మెట్లు, బర్మా టేకుతో చేసిన భారీ తలుపులు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఇత్తడితో చేసిన గుడి గంటను ఏర్పాటు చేశారు. ఇది ఇంటికి ఒక దైవత్వాన్ని తెచ్చిపెట్టింది.
ఇంటి మధ్యలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఓ ఖాళీ ప్రదేశం (ఏట్రియం) ఉంది. అక్కడ 300 కిలోల బరువున్న గ్రానైట్ 'తులసి కోట'ను పెట్టారు. ఇంటి నాలుగు మూలల్లో రిషబ్ జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసే వస్తువులు ఉన్నాయి. వాటిలో యక్షగానం కిరీటాలు, 'కాంతార' సినిమాలో వాడిన తుపాకీ, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ కూడా ఉన్నాయి.
రిషబ్ శెట్టి ఇంట్లో కొన్ని ప్రత్యేకతలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అవేంటంటే..
రెయిన్ రూమ్: ఈ గదికి గాజు గోడలు ఉన్నాయి. ఇక్కడ బటన్ నొక్కితే కృత్రిమంగా వర్షం కురిసేలా సెట్ చేశారు. కథలు రాసుకోవడానికి, ఆలోచించడానికి రిషబ్‌కు ఈ ప్రశాంతమైన ప్రదేశం చాలా ఇష్టమట.
స్క్రీనింగ్ రూమ్: సినిమాలు చూడటానికి అత్యాధునిక సౌకర్యాలతో ఓ స్క్రీనింగ్ రూమ్ ఉంది. ఇందులో ఇటాలియన్ లెదర్‌తో చేసిన సౌకర్యవంతమైన కుర్చీలు, 150 అంగుళాల స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. విశేషం ఏంటంటే, ఇక్కడి ప్రొజెక్టర్‌కు 'కాంతార'లోని దైవం పేరైన 'సెలెయరాయ' అని పేరు పెట్టారు.
గ్యారేజ్: ఇంట్లోని గ్యారేజ్‌లో ఆడి క్యూ7, మహీంద్రా థార్, జీప్ కంపాస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఇక్కడి వాహనాల హారన్‌లను కూడా స్థానిక జానపద సంగీతానికి తగ్గట్టుగా ట్యూన్ చేయించడం మరో విశేషం.
ఇంటికి దగ్గర్లోనే రిషబ్ ప్రొడక్షన్ ఆఫీస్ కూడా ఉంది. పాత రైస్ మిల్లును బాగుచేసి దీన్ని నిర్మించారు. ఇక్కడే ఆయన తన తర్వాతి సినిమాల పనులను చూసుకుంటారు. రిషబ్ శెట్టి తీసిన 'కాంతార' ‘కాంతార 2’ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక ఆయన తెలుగులో హనుమాన్ మూవీ బిజీలో ఉన్నాడు.