
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ శనివారం 61వ ఏట అడుగుపెట్టారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ సహచరుల నుంచి సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమిర్ మాజీ భార్య, ఫిల్మ్‌మేకర్ కిరణ్ రావు కూడా ఆయనకు మనసును హత్తుకునేలా విషెస్ చెప్పారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ షేర్ చేసిన ఓ స్పెషల్ రీల్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేశారు. అందులో ఆమిర్ ఐకానిక్ ఆన్-స్క్రీన్ మూమెంట్స్ ఉన్నాయి. "నా ఫరెవర్ సికందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని కిరణ్ రాసుకొచ్చారు.
ఆమిర్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. అయితే, 2021లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి ఆజాద్ అనే కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి అతడిని పెంచుతున్నారు. కిరణ్‌కు ముందు ఆమిర్‌కు రీనా దత్తాతో వివాహమైంది. రీనాతో ఆమిర్‌కు జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమిర్, గౌరీ స్పాట్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. గత ఏడాది తన 60వ పుట్టినరోజున ముంబైలో మీడియాకు తన పార్ట్‌నర్ గౌరీని ఆమిర్ పరిచయం చేశారు. అప్పటి నుంచి ఆయన లవ్ లైఫ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, ఆమిర్ ఇటీవల 'లగాన్' డైరెక్టర్ అశుతోష్ గోవారికర్‌తో కలిసి రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ, మొదట్లో 'లగాన్' సినిమాలో నటించడానికి తాను ఎంతమాత్రం ఇష్టపడలేదని ఆమిర్ ఓ సీక్రెట్ బయటపెట్టారు.
ఆ సినిమా కోసం గోవారికర్ మూడేళ్లు కష్టపడ్డాడని ఆమిర్ చెప్పారు. "సడెన్‌గా నాకు అనుమానం వచ్చింది. ఇదేదో క్రికెట్, పన్ను (లగాన్) గురించిన కథేమో అనిపించింది. అప్పుడు అశుతోష్ (గోవారికర్) 'ఒక్కసారి కథ విను' అన్నాడు. నేను మాత్రం 'అస్సలు వినను. నువ్వు ఆ కథ మీద మూడు నెలలు వేస్ట్ చేశావ్. నేను మూడు గంటలు కూడా వేస్ట్ చేయను' అని మొండికేశాను. కానీ, అతను చాలా రిక్వెస్ట్ చేయడంతో బాధనిపించి ఒప్పుకున్నా. కథ విన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది" అని ఆమిర్ ఆ ఫెస్టివల్‌లో పంచుకున్నారు.
ఈ సంభాషణలో, 'లగాన్' షూటింగ్ రోజుల నాటి మరెన్నో జ్ఞాపకాలను ఆమిర్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ సెట్‌కు వెళ్లేటప్పుడు రోజూ నటీనటులు, సిబ్బంది అందరూ గాయత్రీ మంత్రం వినేవారని ఓ యూనిక్ అలవాటు గురించి చెప్పారు. "దానికి ఒక్కరోజు కూడా బ్రేక్ రాలేదు. అది మమ్మల్ని ఒకరకమైన ధ్యాన స్థితిలో ఉంచడానికి సాయపడింది. పనికి వెళ్లేటప్పుడు మన మానసిక స్థితి చాలా ముఖ్యం" అని ఆమిర్ వివరించారు.