
బాలీవుడ్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. కథలో భాగంగానే పాటలు ఉంటాయి. బ్రేకప్, ప్రేమకథలు ఇలా అన్నీ పాటల్లోనే చెప్తారు. అందుకే సినిమా కథ, నటీనటులు ఖరారైన తర్వాత ముందుగా పాటల గురించే చర్చిస్తారు. ఎవరు పాడతారు, ఎక్కడ చిత్రీకరిస్తారు, ఎప్పుడు పాట వస్తుంది అన్నీ నిర్ణయిస్తారు. కొన్ని సినిమాలు పాటల వల్లే జనాల్లోకి వెళ్తాయి. మరి 72 పాటలున్న సినిమా గురించి మీకు తెలుసా?
ఎక్కువ పాటలున్న మొదటి హిందీ సినిమా చాలా ఏళ్ల క్రితం వచ్చింది. 1932లో విడుదలైన 'ఇంద్రసభ' (Indrasabha). 3 గంటల 31 నిమిషాల నిడివి గల ఈ సినిమా టాకీ సినిమాల తొలినాళ్లలో వచ్చింది. హిందీ సినిమా పరిశ్రమలో సంగీత యుగానికి నాంది పలికిన సినిమా ఇదే అంటారు. 'ఇంద్రసభ' పేరుతో రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది మణిలాల్ జోషి దర్శకత్వంలో 1925లో వచ్చిన మూకీ సినిమా. రెండోది 1932లో 72 పాటలతో వచ్చిన టాకీ సినిమా. ఇందులో 15 సాధారణ పాటలు, 9 తుమ్రీలు, 4 హోళీ పాటలు, 31 గజళ్ళు, 2 చౌబోలాలు, 5 ఛంద్‌లు, 5 ఇతర పాటలు ఉన్నాయి.
ఈ సినిమా కథ ఒక దయగల, న్యాయవంతుడైన రాజు గురించి. తన ప్రజలను ప్రేమిస్తూ, అందరికీ సాయం చేసే రాజు కథ ఇది. అతని కీర్తి స్వర్గానికి చేరుతుంది. ఇంద్రసభలోని అప్సరస ఒకరు రాజును పరీక్షించడానికి భూమికి వస్తుంది. రాజు గుణాలకు ఆమె ప్రభావితురాలై అతడిని ప్రేమిస్తుంది.
ఈ సినిమాలో జహనారా కాజ్జన్, మాస్టర్ నిసార్ నటించారు. జహనారా మంచి నటి, గాయని. ఆమెను 'బెంగాల్ నైటింగేల్' అనేవారు. 30 ఏళ్లకే చనిపోయారు. ఈ సినిమాలోని 72 పాటల రికార్డును ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చేయలేదు. ఒక సినిమాలో అత్యధిక పాటలున్నందుకు ఈ సినిమా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (1980)లో స్థానం సంపాదించింది.