
ఆస్కార్ అందుకోవడం ప్రతి ఒక్కరి లైఫ్ టైం డ్రీం. దశాబ్దాల పాటు పరిశ్రమలో ఉన్నవాళ్ళు కూడా ఆస్కార్ దరికి చేరుకోలేకపోవచ్చు. అలాంటిది యంగ్ లేడీ కార్తీకి గోన్సాల్వేస్ మొదటి చిత్రంతోనే ఆ గౌరవం అందుకుంది. ఆమె దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇండియన్ ఫిల్మ్ వర్గాలు గర్వపడేలా చేసిన కార్తీకి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
కార్తీకి గోన్సాల్వేస్ 1986 నవంబర్ 2న తమిళనాడులో గల ఊటీలో జన్మించారు. ఆమె తండ్రి తిమోతీ ఎ. గోన్సాల్వేస్ ప్రొఫెసర్, కంప్యూటర్ సైంటిస్ట్. కార్తీకి కోయంబత్తూర్‌లోని డాక్టర్ జి ఆర్ దామోదరన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ నందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. యానిమల్ ప్లానెట్, డిస్కవరీ వంటి అంతర్జాతీయ ఛానల్స్ కి కెమెరా ఆపరేటర్ గా పనిచేశారు.
ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ తో ఏకంగా ఆస్కార్ అందుకున్నారు. తల్లి నుండి వేరుపడి ఒంటరైన ఏనుగు పిల్లతో ఒక కుటుంబానికి ఏర్పడిన అనుబంధాన్ని హృద్యంగా చెప్పి కార్తీకి అకాడమీ మెంబర్స్ ని మెప్పించారు. దిగ్గజ చిత్రాలతో పోటీపడి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. ఆస్కార్ గెలుచుకున్న అతికొద్ది మంది ఇండియన్స్ జాబితాలో కార్తీక చేరారు. ఇది ఆమె మరిన్ని గొప్ప చిత్రాలు తెరకెక్కించేందుకు స్ఫూర్తి ఇచ్చింది.