ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రామాయణ గాథను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రావణుడు పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆది పురుష్ చిత్రంలో రావణుడుగా సైఫ్ అలీ ఖాన్ ని ఎంపిక చేసిన నాటి నుండీ ఈ పాత్రపై డిస్కషన్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఓ స్టార్ హీరో ఇందులో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో అంటే...
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఈ చిత్రంలో రావణుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ విషయమై బాలీవుడ్ మీడియా గతంలో కూడై కూసింది కానీ ఇప్పుడు అతనే రావణుడిగా ఖరారైనట్లు చెప్తోంది. సాధారణంగా హృతిక్ అనగానే రాముడి పాత్ర చేస్తాడేమో అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ రావణుడు పాయింటాఫ్ వ్యూ కు కూడా సమానమైన ప్రయారిటీ ఉంది కాబట్టి .. అతణ్ని రావణుడి పాత్రకు ఎంచుకోవడం జరిగిందని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో సీతగా దీపికా పదుకొనే కనిపించబోతోందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
మొదట సీత పాత్రలో నయనతారను ఎంపికచేసుకోవాలని అనుకుంటున్నారట. అనుష్క పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణ నటించిన 'శ్రీరామ రాజ్యం' చిత్రంలో నయన్ సీత పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ..కేవలం దక్షిణాది భాషల వారికే పరిచయం అదే దీపికా అయితే మొత్తం భారతదేశం మొత్తానికి తెలిసిన నటి కావటంతో ఆమెను తీసుకోబోతున్నట్లు చెప్తున్నారు.
రామాయణాన్ని త్రీడీ రూపంలో తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్ చేతులు కలిపారు. 'దంగల్' ఫేం నితీశ్ తివారీ, 'మామ్' ఫేం రవి ఉద్యవార్ దర్శకత్వం వహించనున్నారు. తొలిభాగం 2021లో విడుదల కానుంది.
ఈ పురాణేతిహాసానికి సంభాషణలు అందించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని నియమించుకున్నారని చెప్తున్నారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగంలో పని చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంగీకరించారని సమాచారం. ఇక మాటాల మాయావిగా పేరున్న త్రివిక్రముడే చెయ్యేస్తే అది వేరే లెవల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు, సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ మేరకు అరవింద్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా.. ముంబయిలో మధు మంతెన చకచకా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుందని, అంతకంటే ముందు గ్రాండ్ లాంచింగ్ ఉంటుందని సమాచారం.