
కొన్ని సినిమాలకు ఊహించని విధంగా క్రేజ్ వస్తుంది. అందుకు రకరకాల కారణాలు ఉంటాయి. అలా రీసెంట్ గా అందరి దృష్టిలో పడిన చిత్రం ధూమమ్. కేజీఎఫ్, కాంతార లాంటి భారీ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా నిర్మించిన చిత్రం ధూమమ్. లూసియా, యూ టర్న్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ సినిమా దర్శకుడు. ఫాహద్ ఫాజిల్, రోషన్ మ్యాథ్యూ, అపర్ణ బాలమురళి, వినీత్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రం జూన్ 23న రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది..కథలో దర్శకుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటో చూస్తే..
. అవినాష్ (ఫహద్ ఫాజిల్), దివ్య (అపర్ణా బాలమురళి) మొగడు,పెళ్లాలు. సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్ కు ఆ కంపెనీపై సదభిప్రాయం ఉండదు. భారీ జీతం ఇస్తున్నా దాన్ని వదలేయాలనుకుంటాడు. మరో ప్రక్క ఆ కంపెనీ యజమాని సిద్ (రోషన్ మ్యాథ్యూ) అదిరిపోయే పబ్లిసిటీతో సిగరెట్ అమ్మకాలు రెట్టింపు చేస్తాడు. ఆ పబ్లిసిటీకు చిన్న పిల్లలు సైతం కష్టమర్లు గా మారటం అవినాష్ జీర్ణించుకోలేకపోతాడు. దాంతో అవినాష్ తన ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు. ఆ తర్వాత అవినాష్, దివ్యపై కొందరు దాడి చేస్తారు.ఆ తర్వాత అవినాష్ అతని భార్య దియా(అపర్ణ బాలమురళి)ప్రమాదంలో పడతారు. వాళ్లు టైం బాంబుకు బలి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సిగరెట్లు తాగుతూ తక్కువ టైంలో కోటి రూపాయలు పోగు చేయాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ.
సినిమా పాయింట్ గా బాగున్నా..తీసే విధంగా అంత గొప్పగా లేదని రివ్యూలు వచ్చాయి. చాలా చోట్ల బోరింగ్ గా, ల్యాగ్ గా ఉందని అంటున్నారు. ట్రైలర్, పవన్ గత చిత్రాలను చూసి ధూమం చేస్తే నిరాశ కలుగుతుంది తప్ప అంచనాలకు తగ్గటయితే లేదు. ఈ సినిమా తెలుగు రిలీజ్ లేదు. కానీ ఫహద్ ఫాసిల్ కొత్త సినిమా ధూమం మీద ఇక్కడ మూవీ లవర్స్ కి మంచి ఇంట్రస్ట్ నెలకొంది. కేవలం కన్నడ,మళయాళ వర్షన్లు మాత్రమే థియేటర్లకు వచ్చాయి.
ఈ సినిమాను కన్నడలోనే తీయాలని డైరెక్టర్ పవన్ భావించాడట. అయితే అది కుదరకపోవడంతో మలయాళంలో ఈ మూవీ తీసినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కన్నడలో నటులు ఈ స్టోరీతో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడం, ప్రొడ్యూసర్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో తాను మలయాళంలో తీసినట్లు పవన్ తెలిపాడు. అయితే మలయాళంలో మాత్రం ఫహద్, రోషన్, అపర్ణ బాలమురళీలాంటి నటీనటులు ఈ మూవీ చేయడం విశేషం.
ఫదాహ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ ముందుగా తనకు నికోటిన్ అనే స్క్రిప్ట్ ను అందించినట్లుగా తెలిపారు. అయితే అది కాస్తా 'ధూమమ్' గా మారిందని చెప్పారు. కరోనా ప్యాండమిక్ కన్నా ముందు స్క్రిప్ట్ రెడీ అయిందని తెలిపారు. ముందుగా ఈ సినిమా మలయాళంలో తీయాలని అనుకోలేదని చెప్పారు. చాలా చర్చల అనంతరం మలయాళంలోనే ఫిక్స్ అయ్యామని తెలిపారు.