Latest Videos

కల్కికి అదే మైనస్ కానుందా... వాళ్లకు నచ్చేనా?

By Sambi ReddyFirst Published Jun 21, 2024, 4:28 PM IST
Highlights

కల్కి 2829 AD విడుదలకు మరో వారం సమయం మాత్రమే ఉంది. మేకర్స్ భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అయితే కల్కి సక్సెస్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అభిరుచి మీదే ఆధారపడి ఉంది. వారికి నచ్చితేనే సినిమా సక్సెస్. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. 
 

కల్కి 2829 AD చిత్రం కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా కష్టపడ్డాడు. అందులో సందేహం లేదు. ఈ కథను రాసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. దాదాపు మూడేళ్లు చిత్రీకరణకు సమయం పట్టింది. ట్రైలర్ విడుదలకు ముందు వరకు కల్కి చిత్రం ఎలా ఉంటుందనే అవగాహన లేదు. ట్రైలర్ కొన్ని సందేహాలు తీర్చింది. కల్కి అవుట్ అండ్ అవుట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చారు. కల్కి భవిష్యత్ లో వస్తాడు. ఆయన వచ్చేనాటికి ప్రపంచం ఎలా ఉంటుందో సృష్టించారని తెలుస్తుంది. 

అంతా ఒకే కానీ... హాలీవుడ్ తరహాలో సాగే కథ, విజువల్స్, గ్రాఫిక్స్...  తెలుగు తో పాటు సౌత్ ఆడియన్స్ నచ్చుతాయా అని. ప్రభాస్ అభిమానులు చాలా వరకు మాస్. వాళ్లకు సంక్లిష్టమైన కథ, కథనం అర్థం కాకపోవచ్చు. అలాగే తెలుగులో హాలీవుడ్ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్ చాలా తక్కువ ఉంటారు. ఓ వర్గానికి అసలు నచ్చవు. అదే సమయంలో హాలీవుడ్ చిత్రాలు ఇష్టపడే ఆడియన్స్...  పరిమిత బడ్జెట్ లో ఇండియన్ డైరెక్టర్ ఇచ్చే గ్రాఫిక్స్, విజువల్స్ ని అంతగా ఇష్టపడరు. 

కాబట్టి అటు హాలీవుడ్ చిత్రాలు ఇష్టపడని వారు ఇష్టపడేవారు కూడా కల్కి చిత్రానికి కనెక్ట్ కాకపోవచ్చు. సాహో విషయంలో జరిగింది ఇదే. దర్శకుడు సుజీత్ చాలా ప్రతిభ కనబరిచాడు. ఇంగ్లీష్ చిత్రాలను తలపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. తెలుగు ఆడియన్స్ కి ఆ మూవీ ఎక్కలేదు. అదే చిత్రం హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది కూడా బ్యాడ్ రివ్యూస్ తో. 

సాహో చిత్రంలో కొంత మేర మాస్, కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయి. కానీ కల్కి పక్కా హాలీవుడ్ మూవీని తలపిస్తుంది. కాబట్టి దర్శకుడు నాగ్ అశ్విన్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ తెలుగు ఆడియన్స్ ని మెప్పించడం. హిందీ, ఓవర్సీస్ లో ఈ చిత్రం ఆడినా లాభాలు రావాలంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తెచ్చుకోవాలి. తెలుగు రాష్ట్రాలు టాలీవుడ్ కి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్నాయి. మరి చూడాలి... కల్కి చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో.. 

కల్కి చిత్రం జూన్ 27న విడుదల  అవుతుంది. ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, శోభన వంటి స్టార్ క్యాస్ట్ భాగమయ్యారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు.. 
 

click me!