పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం Adipurush. నిన్న భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మళ్లీ వివాదాల బారిన పడింది. ఈ చిత్రంపై తాజాగా హిందూ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ చిత్రాన్ని మొదటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ విమర్శల పాలవుతూనే వస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - కృతిసనన్ సీతారాములుగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మించారు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
అయితే, ‘ఆదిపురుష్’ గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిందన్న విషయం తెలిసిందే. కానీ అప్పల్లో విడుదల చేసిన టీజర్ నాసిరంగా ఉండటంతో వాయిదా పడింది. అదే సమయంలో రామాయణంలోని పాత్రలను ‘ఆదిపురుష్’లో భిన్నంగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. రాముడు, రావణుడు, ఆంజనేయుడిని, సీతాదేవిని చూపించిన తీరు ఏమాత్రం నచ్చలేదు. ఈ విషయంలో హిందూ సంస్థలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వస్తున్నాయి. గతంలో ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది.
ఇక నిన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో మళ్లీ అవే ఆరోపణలు వస్తున్నాయి. హిందువులు దేవుడిగా కొలిచే రాముడిని, ఎంతగానో గౌరవించే రామాయణాన్ని హేళన చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. ఈ విషయంలో హిందూ సేన మాత్రం సిరీయస్ గా ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, రామయాణాన్ని హేళన చేసేలా సినిమా ఉందంటూ ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ మేరకు పిల్ కూడా దాఖలైంది. దర్శకుడు ఓం రౌత్ తనకిష్టమొచ్చినట్టు రామయాణాన్ని తెరకెక్కించారని మండిపడుతున్నారు.
‘ఆదిపురుష్’లోని ప్రధాన పాత్రలను డిజైన్ చేసిన తీరు సరిగా లేదని హిందూ సేన అభ్యంతరం వ్యక్తం చేసింది. వాల్మీకి రామాయణానికి.. ‘ఆదిపురుష్’లో చూపించిన శ్రీరాముడు, సీత, హనుమంతుడు, రావణుడు, ఇతర పాత్రలు విరుద్ధంగా ఉన్నాయని హిందూ సేన జాతీయ అధ్యకుడు విష్ణు గుప్తా పిటషన్ లో పేర్కొన్నారు. భారత సంప్రదాయాల్ని ఎగతాళి చేశారని, చిత్రానికి ఇచ్చిన పబ్లిక్ ఎగ్జిబిషన్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని కోరారు.
టీజర్ నాసిరకంగా ఉండటంతో.. మరింత ఖర్చుతో విజువల్స్ ను సరి చేశారు. ఆ తర్వాత వచ్చిన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ తీరా థియేటర్ లోకి వచ్చే సరికి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. మొదటి భాగం పర్లేదని, రెండో భాగం మరీ ఆడియెన్స్ ను డిస్పాయింట్ చేశారని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. సినిమా ఫలితం తర్వాత నెటిజన్లు డైరెక్టర్ ఓం రౌత్ ను బాగా ట్రోల్ కూడా చేస్తున్నారు. కానీ చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతుండటం విశేషం.