‘మహర్షి’ మ్యాటర్ పై హై కోర్ట్ ఏం తేల్చిందంటే..!

By AN TeluguFirst Published May 11, 2019, 1:08 PM IST
Highlights

గత కొద్ది రోజులుగా థియోటర్ యాజమాన్యాలకు, తెలంగాణా ప్రభుత్వానికి  వివాదంగా మారిన మహర్షి చిత్రం టిక్కెట్ల వివాదం హైకోర్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. 

గత కొద్ది రోజులుగా థియోటర్ యాజమాన్యాలకు, తెలంగాణా ప్రభుత్వానికి  వివాదంగా మారిన మహర్షి చిత్రం టిక్కెట్ల వివాదం హైకోర్ట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. 'మహర్షి' సినిమా విషయంలో తాము రేట్లు పెంచుకునేలా అనుమతించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలని తమ పిటీషన్లో కోరారు. అయితే వీరి పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ తోసిపుచ్చారు.

అంతేకాదు ‘మహర్షి’ సినిమా టికెట్‌ ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి థియేటర్ల యజమానులు పెట్టుకున్న వినతిపై 16లోగా నిర్ణయం తీసుకోవాలని లైసెన్సింగ్‌ అథారిటీ, నగర పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే... సినిమా టికెట్‌ రేట్లను పెంచుకోవడానికి అనుమతించాలంటూ గత నెల 30, ఈనెల 1, 2, 4 తేదీల్లో వినతి పత్రాలిచ్చినా నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ గాయత్రి హోటల్స్‌ అండ్‌ థియేటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఐనాక్స్‌, పీవీఆర్‌, జీవీకె, సినీమాక్స్‌తో సహా దాదాపు 15 థియేటర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌ విచారణ చేపట్టారు. 

పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు టికెట్‌ ధరల పెంపుపై సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదన్నారు. 

ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగా ‘మహర్షి’ సినిమా విడుదలైందని, టికెట్‌ ధరలను పెంచుకోవడానికి అనుమతించాలంటూ వినతి పత్రాలు సమర్పించినా పోలీసు కమిషనర్‌ చర్యలు తీసుకోవడంలేదన్నారు. థియేటర్ల యాజమాన్యాలు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో ఈనెల 16లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ ముగించింది. 

click me!