పాన్ ఇండియా స్టార్ యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల ప్రభంజనం తర్వాత యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
పాన్ ఇండియా స్టార్ యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాల ప్రభంజనం తర్వాత యష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశం మొత్తం యష్ పై అభిమానం వెల్లివిరిసింది.
ఒకసారి హీరోపై అభిమానం పెంచుకుంటే ఫ్యాన్స్ ఎలా ప్రవర్తిస్తారో తెలిసిందే. ప్రాణాలని కూడా లెక్కచేయరు. తమ హీరోలపై మితిమీరిన అభిమానం ప్రదర్శించే క్రమంలో కొందరు ఫ్యాన్స్ విషాదకర సంఘటనలకు గురవుతుండడం చూస్తూనే ఉన్నాం.
జనవరి 8న యష్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ ఏర్పాటు చేసే క్రమంలో కరెంట్ షాక్ కి గురైన ఫ్యాన్స్ మృత్యువాతపడ్డారు. ముగ్గురు అభిమానులు మరణించారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మృతుల కుటుంబాలకు వెంటనే యష్ రూ 5 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా గాయపడ్డ వారిని సైతం యష్ ఆదుకున్నారు. హరిజన్, మురళి, నవీన్ అనే అభిమానులు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే యష్ సురంగి గ్రామానికి వెళ్లి వారి కుటుంబాలని పరామర్శించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో కుటుంబానికి 5 లక్షల సాయం అందించారు. ఇప్పుడు గాయపడ్డ వారిని సైతం యష్ ఆదుకున్నారు. మంజునాథ్, ప్రకాష్, హనుమంత్, నాగరాజు అనే అభిమానులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబాలకు యష్ నేరుగా బ్యాంక్ ఖాతాలోకి రూ లక్ష రూపాయల చొప్పున జమ చేశారు.
అభిమానులని ఆదుకోవడం యష్ చూపించిన చొరవ అద్భుతం అంటూ ఫ్యాన్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.