నేడు సీఎం జగన్‌ను కలవనున్న హీరో విశాల్.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..!

By Sumanth KanukulaFirst Published Dec 20, 2022, 10:29 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు విశాల్ నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కాబోతున్నారు.

ప్రముఖ సినీ నటుడు విశాల్ నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కాబోతున్నారు. పలు సందర్భాల్లో విశాల్.. సీఎం జగన్‌కు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో జగన్ సర్కార్ వెబ్ పోర్టల్‌ను అందుబాటులో తీసుకురావడంపై కూడా విశాల్ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విశాల్ కుప్పం నుంచి చంద్రబాబుపై వైసీపీ తరఫున బరిలో నిలుస్తారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ వార్తలను విశాల్ ఖండించారు. విశాల్ తాజా చిత్రం లాఠీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం తిరుపతిలో నిర్వహించారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన విశాల్.. తాను కుప్పంలో పోటీ చేయనని.. తమకు కుప్పంలో వ్యాపారాలు ఉన్నాయన్నారు. అక్కడి వారితో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. అలాగే ‘‘ఐ లవ్ జగన్’’ అని కూడా చెప్పారు. 

‘‘నాకు జగన్ అంటే చాలా ఇష్టం. నేను కుప్పం నుంచి పోటీ చేయను. కుప్పంలో మాకు వ్యాపారాలు ఉన్న మాట వాస్తవమే. కుప్పంలో వీధి వీధి బాగా తెలుసు కానీ నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని కాదు. నా దృష్టిలో రాజకీయాలు అంటే ప్రజాసేవ. నేను రాజకీయాల ద్వారా సంపాదించే దానికంటే సినిమాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఎమ్మెల్యే‌కు ఎంత అభిమానం ఉందో అంతకంటే ఎక్కువ అభిమానం నాకు ఉంది. ప్రస్తుతం నటుడిగా సంతోషంగా ఉన్నాను’’ అని విశాల్ మీడియాతో చెప్పారు. 

ఇక, నేడు సీఎం జగన్‌తో విశాల్ భేటీ కానున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలోనే ఉన్న విశాల్.. తాడేపల్లిలో సీఎం జగన్‌ను కలవనున్నారు. అయితే ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదని.. ఇప్పుడు అవకాశం రావడంతోనే ఆయనను విశాల్ కలుస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా కుప్పం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వై నాట్ 175 నినాదంతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్.. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే కుప్పంపై స్పెషల్ ఫోకస్ ‌పెట్టారనే చెప్పాలి. చాలా సభలలో కూడా కుప్పంకు చంద్రబాబు  చేసిందేమి లేదని.. తాము వచ్చాకే అభివృద్ది చేస్తున్నామని, రెవెన్యూ డివిజన్ కూడా చేశామని జగన్ ప్రస్తావిస్తున్నారు. అక్కడ బలమైన అభ్యర్థిని దింపాలని భావిస్తున్నారు. అయితే కుప్పం నుంచి తాను పోటీ చేసే వార్తలను విశాల్ ఖండించినప్పటికీ.. జగన్‌‌తో ఆయన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మర్యాదపూర్వక సమావేశం అని చెప్పినప్పటికీ.. రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రానున్న ఎన్నికల్లో జగన్‌‌కు మద్దతుగా నిలిచేలా రూపొందుతున్న చిత్రాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. 

click me!