యంగ్ హీరో సుహాస్ ఒక్కో సినిమాతో హిట్ అందుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజి బ్యాండు`తో వస్తున్నాడు. మరోసారి రచ్చ చేయబోతున్నాడు.
యంగ్ హీరో సుహాస్ నెమ్మదిగా ఒక్కో సినిమాతో తనేంటో నిరూపించుకుంటున్నాడు. సైడ్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. వరుస విజయాలు అందుకుంటున్నాడు. `రైటర్ పద్మభూషణ్` తర్వాత ఇప్పుడు `అంబాజీపేట మ్యారేజి బ్యాండు` చిత్రంలో నటిస్తున్నారు. దుశ్యంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శివానీ నగరం హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. అయితే ఇందులో కులం ప్రస్తావన ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. `కలర్ ఫోటో` ఛాయలు కనిపిస్తున్నాయి.
తాజాగా దీనిపై సుహాస్ స్పందించారు. ఇందులో కూడా కులం ప్రస్తావన ఉంటుందని తెలిపారు. అయితే సినిమా పాయింట్ కులం కాదని, క్యాస్ట్ అనేది కేవలం కొన్ని సీన్లకే పరిమితం మాత్రమే అని, కానీ అసలు పాయింట్ వేరే అని తెలిపారు. తాను శరణ్ ఇందులో కవలలు అని, ఆమె పాత్ర ద్వారా పుట్టిన ఒక కాన్‌ఫ్లిక్ట్ సినిమాని అనేక మలుపులు తిప్పుతుందని, మరి అదేంటనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. సినిమాలో సాడ్ ఎండింగ్ నిజం కాదని, కానీ చివర్లో ఓ సంతృప్తితోనే ఆడియెన్స్ బయటకు వెళ్తారని తెలిపాడు సుహాస్.
సినిమా కోసం ముందస్తుగా చాలా హోంవర్క్ చేసినట్టు తెలిపారు. మ్యారేజీ బ్యాండ్ కి సంబంధించి సహజత్వం ఉండాలని కొన్ని రోజులపాటు బ్యాండ్ నేర్చుకున్నట్టు తెలిపారు. `కథలో బాగా కనెక్ట్ అవ్వాలని అనుకున్న సీన్స్ ప్రాక్టీస్ చేశాం. రెండు సార్లు గుండు గీయించుకున్నా. అలా రెండేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను నమ్మి కష్టపడ్డాం. మా నమ్మకం, రెండేళ్ల కష్టం సక్సెస్ రూపంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. అమలాపురం, అంబాజీపేటలో షూటింగ్ చేశాం. నాకు అక్కడి వాతావరణం, స్లాంగ్ గురించి తెలుసు. ఆ ఏరియాల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. టైమ్ దొరికితే ఫ్రెండ్స్ తో అక్కడి ఏరియాలకు వెళ్తుంటాను` అని తెలిపారు.
`హీరోగా కంటే నటుడిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టం. `హిట్ 2`లో విలన్ గా నటించిన తర్వాత అలాంటివే చాలా ఆఫర్స్ వచ్చాయి. విలన్ రోల్స్ వద్దనుకుని మళ్లీ హీరోగా చేస్తున్నా. నాకు ఇంకొంత వయసు వచ్చాక మరికొన్ని భిన్నమైన క్యారెక్టర్స్ కు సెట్ అవుతా అనిపిస్తోంది. ఇప్పుడు చిన్నగా కనిపించడం వల్ల అన్ని రకాల క్యారెక్టర్స్ కు సెట్ కానేమో అనిపిస్తుంటుంది. కానీ హీరో అనే జోన్‌లో ఉండను, మంచి పాత్రలు వస్తే ఏదైనా చేస్తాను` అని తెలిపారు సుహాస్. ఇప్పుడు `కలర్ ఫొటో` ఫేమ్ సందీప్ తో ఓ సినిమా చేయబోతున్నా. కథ నెక్ట్స్ లెవెల్ లో ఉంది. సుకుమార్ అసోసియేట్ తో `ప్రసన్నవదనం` అనే ఒక సినిమా చేశా. అది కంప్లీట్ అయ్యింది. `కేబుల్ రెడ్డి` అనే మరో మూవీ చేస్తున్నా. దిల్ రాజు గారి బ్యానర్ లో సలార్ రైటర్ తో ఒక మూవీ షూటింగ్ జరుగుతోంది` అని చెప్పాడు సుహాస్. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు.