ఈగ 2 ఎప్పుడు చేద్దామని రాజమౌళిని హీరో నాని అడిగితే.. మాకు నీ అవసరం లేదు అన్నాడట. తాజా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని ఉద్దేశిస్తూ నాని చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి..
నాని కెరీర్లో మైలురాయిగా నిలిచింది ఈగ. దర్శకుడు రాజమౌళి ప్రయోగాత్మకంగా ఈ మూవీ చేశాడు. విలన్ చేతిలో చంపబడ్డ హీరో ఈగ గా పుట్టి ఎలా పగ తీర్చుకున్నాడు అనేది కథ. స్టార్ హీరోలతో కమర్షియల్ చిత్రాలు చేస్తున్న తరుణంలో రాజమౌళి నుండి వచ్చిన ఈ చిత్రం ఆసక్తి రేపింది. ఈ చిత్రంలో నాని రోల్ చాలా పరిమితంగా ఉంటుంది. హీరోయిన్ గా సమంత, ప్రధాన విలన్ రోల్ కన్నడ స్టార్ సుదీప్ చేశారు. 2012లో విడుదలైన ఈగ బ్లాక్ బస్టర్. ఇండియా వైడ్ ఈ సినిమా పై చర్చ జరిగింది.
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈగ. నానికి టొరంటో ఆఫ్టర్ డార్క్ బెస్ట్ హీరో అవార్డు గెలుచుకున్నాడు. ఈగ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉందని రాజమౌళి గతంలో అన్నారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో నాని రాజమౌళితో ప్రస్తావించారట. అప్పుడు రాజమౌళి అన్నమాటలు నాని గుర్తు చేసుకున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో నాని మట్లాడుతూ.. ''విజయేంద్ర ప్రసాద్ సర్ తో నేను ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి మాట్లాడలేదు. అయితే రాజమౌళి సర్ తో సరదాగా ఒకసారి చర్చించాను. ఈగ 2 చేద్దామని అన్నారు కదా? చెప్పండి ఎప్పుడు మొదలు పెడదాం? అన్నాను. దానికి రాజమౌళి.. మేము ఈగ 2 చేసినా నీ అవసరం మాకు ఉండదు. ఆ ఈగ మళ్ళీ తిరిగి వస్తుంది, అన్నారు...'' అని అన్నాడు. ఫస్ట్ పార్ట్ లోనే నాని చనిపోయాడు కాబట్టి. కథలో నాని పార్ట్ ముగిసింది. అందుకే రాజమౌళి నాని అవసరం లేదని చెప్పినట్లు మనకు అర్థం అవుతుంది.
నాని లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం ఆగస్టు 29న విడుదలవుతుంది. వివేక్ ఆత్రేయ ఈ చిత్ర దర్శకుడు. ఎస్ జే సూర్య విలన్ రోల్ చేస్తున్నాడు. ప్రియాంక మోహన్ నానితో మరోసారి జతకడుతుంది. సరిపోదా శనివారం పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. నాని స్ప్లిట్ పర్సనాలిటీ డిజాస్టర్ తో బాధపడే వ్యక్తిగా కనిపిస్తాడట.