`దసరా` సక్సెస్ ఆనందంలో ఉన్న హీరో నాని.. వరుసగా టీవీ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఆయన ఇండియన్ ఐడల్ 2లో పాల్గొన్నారు. అంతేకాదు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.
నాని `దసరా` సక్సెస్‌లో ఉన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీవీ షోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అందులో భాగంగా నాని లేటెస్ట్ గా `ఇండియన్ ఐడల్2`లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది ఆహా. `ఇండియన్ ఐడల్ 2` ఆహాలో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. నాని పాల్గొన్న ఎపిసోడ్ ఈ నెల 7,8తేదీల్లో ప్రసారం కాబోతుంది. ఈ సారి ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా నిలవబోతుందని తెలిపింది. నాని పాల్గొనడంతో ఈ షోకి క్రేజ్‌తోపాటు హైప్ వచ్చిందన్నారు. టాప్ 10 కంటెస్టంట్లు ఈ ఎపిసోడ్స్ తో మధురగాయకుడు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎప్పీ చరణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
ఈ స్పెషల్ ఎపిసోడ్ గురించి `ఆహా` టీమ్ చెబుతూ, `నేచురల్ స్టార్ నాని పాల్గొంటున్న హై ఎనర్జీ ఎపిసోడ్స్ ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే నాని రీసెంట్ బ్లాక్ బస్టర్ `దసరా` సినిమాలోని చమ్కీల అంగీలేసీ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. దీన్ని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఈ షోలో న్యాయ నిర్ణేతలు ఎస్.ఎస్.తమన్, గీతామాధురి, కార్తిక్, ఎస్పీ చరణ్‌తో కలిసి నాని కూడా ఈ వేదిక మీద ఓ పాట పాడటం విశేషం.
ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కెరీర్ బెస్ట్ సాంగ్స్ తో ఆయనకు నివాళులర్పించారు కంటెస్టెంట్స్. అంతే కాదు, ఈ వేదిక మీద సింగర్ కార్తికేయ.. నాని మనసు గెలిచారు. హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ గళం విన్న నాని మెస్మరైజ్ అయ్యారు. తన తదుపరి చిత్రాల్లో కార్తికేయకు గాయకుడిగా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. నాని మాటలు విని 16 ఏళ్ల కార్తికేయ ఆనందానికి అవధుల్లేవు. జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఈ సందర్భంగా పలకరించడం ఆనందంగా ఉందని అన్నారు నాని. తన దసరా ప్యాన్ ఇండియా రేంజ్ సక్సెస్ అయిన సందర్భంగా అందరితోనూ ఆ సంతోషాన్ని పంచుకోవడం హ్యాపీగా ఉందని చెప్పారు నేచురల్ స్టార్.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్2కి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో అభిమానులున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 2. సంగీత ప్రపంచంలో ప్రముఖులైన హిమేష్ రేష్మియా, శ్రేయా ఘోషల్, విశాల్ దడ్లానీ, జీవీ ప్రకాష్ తో పాటు ఎంతో మందిని తమ గళాలతో మెప్పిస్తున్నారు గాయనీ గాయకులు. అటు నేచురల్ స్టార్ నాని, ఇటు ఎస్పీ చరణ్ ముఖ్య అతిథులుగా ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ సంగీతాభిమానులకు పండగలా ఉంటుంది` అని చెప్పింది.