
సూర్య సోదరుడిగా అడుగు పెట్టిన హీరో కార్తీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. యువతలో క్రేజ్ పెంచుకున్న కార్తీ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. హీరో కార్తీతో సినిమాలు చేస్తే మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్ ఉంది. తాజాగా కార్తీ మరో హిట్ అందుకున్నాడు.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ చిత్రం ఇటీవల విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ పండితులు ఈ చిత్రం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది అని చెబుతున్నారు.
ఈ సందర్భంలో హీరో కార్తీ అభిమానుల జోష్ మరింత పెంచాడు. సర్దార్ టీం సర్దార్ పార్ట్ 2 ప్రకటించారు. దీనికోసం చిన్న టీజర్ విడుదల చేసి సర్దార్ 2 అనౌన్స్ చేయడం విశేషం. టీజర్ లో ఓ అధికారి కార్తీని పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి తొలగిస్తున్నట్లు చెబుతారు. కానీ సీక్రెట్ ఏజెంట్ గా ఉండాలని చెప్పడంతో కార్తీ యస్ సర్ అని అంటాడు.
ఒకసారి గూఢచారి అయితే ఎప్పటికీ గూఢచారే అనే ట్యాగ్ పడుతుంది. సర్దార్ మొదటి భాగంగా నీటి విలువని తెలియజేశారు. సస్పెన్స్ అంశాలతో దర్శకుడు మిత్రన్.. కథని అద్భుతంగా నడిపించారు అనే ప్రశంసలు దక్కుతున్నాయి.
సర్దార్ చిత్రంలో రాశి ఖన్నా, రాజిషా విజయన్, లైలా కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మిత్రన్ అభిమన్యుడు చిత్రంతో గుర్తింపు పొందారు. ఆ చిత్రంలో బ్యాంక్ మోసాలు బయట పెట్టిన దర్శకుడు.. ఈ చిత్రంలో నీటి వెనుక దాగున్న మాఫియా గురించి అద్భుతంగా వివరించారు.