
స్టార్ హీరోలపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇదో నిదర్శనం. బాలయ్య వీరాభిమాని ఒకరు ఆయన తన పెళ్ళికి రావాలని కోరుకుంటున్నారు. బాలయ్య పెళ్ళికి వచ్చి ఆశీర్వదిస్తేనే తాళి కడతానని కండీషన్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే... విశాఖజిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంకి చెందిన పులమరశెట్టి కోమలీ పెద్దినాయుడు బాలకృష్ణకు డైహార్డ్ ఫ్యాన్. తన పెద్దల నుండి ఈ అభిమానం వారసత్వంగా తీసుకున్నాడు. పెద్దినాయుడు తండ్రి పులమరశెట్టి వెంకటరమణ సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నారు. ఇక వీరి ఇంట్లో ఎన్టీఆర్, బాలయ్య ఫోటోలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఎన్టీఆర్ ని దేవుడిగా ఆరాధిస్తారట.
ఇటీవల పెద్దినాయుడుకి పెళ్లి కుదిరింది. పెళ్లి పత్రిక కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడు. ఆరు పేజీల పెళ్లి పత్రిక ఎన్టీఆర్, బాలయ్య ఫొటోలతో నింపాడు. ఎన్టీఆర్ దివ్యాశీస్సులతో అని రాయించాడు. ఇక పెళ్లి మార్చి 11న కాగా బాలయ్య హాజరుకావాల్సిందే అంటున్నాడు. తన పెళ్లి విషయం బాలయ్యకు తెలియజేయాలని పలుకుబడి ఉన్నవాళ్లను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈ విషయం మీడియా దృష్టికి వెళ్లడంతో సదరు యువకుడిని సంప్రదించింది. బాలయ్య వస్తేనే నేను తాళి కడతానని చెప్పడంతో అందరూ విస్తుపోతున్నారు. అదే సమయంలో బాలయ్య ఈ అభిమాని కోరిక తీర్చాలని కోరుకుంటున్నారు.
అయితే బాలయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన దశదిన కర్మ కూడా ముగియలేదు. బాలయ్య తన 108వ చిత్ర షూటింగ్ వెనక్కి జరిపారు. ఇంత వేదనలో ఆయన పెళ్లిళ్లకు హాజరవుతారని చెప్పలేం. చూడాలి ఇక ఏం జరుగుతుందో...!