
హీరో నాగార్జున తన సోదరిని కోల్పోయారు. తన ముగ్గురు సిస్టర్స్ లో ఒకరైన నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారమే ఆమె హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సత్యవతి, నాగ సరోజ, నాగ సుశీల, వెంకట్, నాగార్జున ఐదుగురు సంతానం. పెద్ద కుమార్తె సత్యవతి చాలా కాలం క్రితమే కన్నుమూశారు.
నిన్న నాగ సరోజ మరణించినట్లు సమాచారం అందుతుంది. కొన్నాళ్లుగా నాగ సరోజ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిత్ర పరిశ్రమలో అక్కినేనిది పెద్ద కుటుంబం. అయినప్పటికీ నాగ సరోజ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఎలాంటి సినిమా వేడుకలకు హాజరయ్యేవారు కాదు. అందుకే నాగ సరోజ గురించి తెలిసింది తక్కువ.
నాగ సరోజ చెల్లెలు నాగ సుశీల మాత్రం నిర్మాతగా చిత్రాలు తెరకెక్కించారు. ఈమెకు చిత్ర వర్గాలతో పరిచయం ఉంది. ఈమె కుమారుడు సుశాంత్ నటుడిగా రాణిస్తున్నాడు. నాగ సరోజ మరణవార్త విన్న ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జన్మదినం పురస్కరించుకుని శతజయంతి వేడుకలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో ప్రముఖుల సమక్షంలో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.