
ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తమిళ తంబీలైతే ఆయన్ని ఆరాధిస్తారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని... సీఎం సీటు అధిరోహించాలని డై హార్డ్ ఫ్యాన్స్ ఏళ్లుగా కోరుకుంటున్నారు. రజనీకాంత్ కి కూడా మనసులో ఆ ఆలోచన, ఆశ ఉన్నాయి. కానీ సరైన సమయం కోసం వేచి చూశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ప్రకటించి అభిమానుల్లో ఆశలు నింపారు.
రజనీకాంత్ ఎన్నికల బరిలో దిగడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. దేవుడు ఆదేశం మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అభిమానులు నిరసన తెలిపినా రజనీకాంత్ మనసు మారలేదు. రజనీకాంత్ ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే వాదన కూడా వినిపించింది.
ఎట్టకేలకు రజనీకాంత్ తన రాజకీయ నిష్క్రమణకు కారణం చెప్పాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నన్ను డాక్టర్ రాజన్ రవిచంద్రన్ హెచ్చరించారు. మీరు విరివిగా సభలు నిర్వహించడం, ప్రయాణాలు చేయడం మంచి కాదన్నారు. అదే సమయంలో కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదని తలచి నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం చెబితే నేను భయపడుతున్నట్లు భావించే అవకాశం ఉందని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా రజనీకాంత్ శరీరం సహకరించకే రాజకీయాలు వద్దనుకుంటున్నట్లు చెప్పారు. తాజాగా రజనీకాంత్ స్పష్టమైన సమాచారం.
దేవుడనేవాడు ఉన్నాడని, దానికి మనిషి శరీరంలో ప్రవహిస్తున్న రక్తమే రుజువని రజనీకాంత్ అన్నారు. చెన్నైలో మార్చి 11న జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఈ మేరకు మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు... గతంలో రజనీకాంత్ ని రాజకీయాల్లోకి రావద్దని సలహా ఇచ్చానన్నారు. ఆ సమయంలో ఆయన నన్ను అపార్థం చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు.
కాగా ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ మూవీలో నటిస్తున్నారు. డాక్టర్ మూవీ ఫేమ్ నెల్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. రజినీకాంత్ తన 170వ చిత్ర ప్రకటన కూడా చేశారు. జ్ఞానవేల్ డైరెక్షన్ లో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.