
పవన్ ఏ ముహూర్తాన హరి హర వీరమల్లు మొదలుపెట్టాడో కానీ రాప్ అప్ గుమ్మడికాయ కొట్టలేకపోతున్నాడు. రెండేళ్లకు పైగా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. కిందా మీద పడి 80 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. మిగతా పార్ట్ పూర్తి చేయకుండానే పవన్ మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు. దీంతో హరి హర వీరమల్లు పరిస్థితి మొదటికి వచ్చిందని టాలీవుడ్ వర్గాల బోగట్టా.
పచ్చిగా చెప్పాలంటే పవన్ రీమేక్స్ పక్షపాతానికి హరి హర వీరమల్లు బలవుతుంది. అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ హరి హర వీరమల్లును తీవ్రంగా దెబ్బతీసింది. భీమ్లా నాయక్ చిత్ర షూట్ కి కేటాయించిన సమయం హరి హర వీరమల్లుకు కేటాయిస్తే ఆ మూవీ ఇప్పటికి విడుదలకు సిద్ధంగా ఉండేది. ముందుగా అనుకున్న హరి హరి వీరమల్లు పక్కన పెట్టి యుద్ధ ప్రాతిపదికన భీమ్లా నాయక్ పూర్తి చేశారు. భీమ్లా నాయక్ విడుదల అనంతరం కొంత సమయం హరి హర వీరమల్లుకు కేటాయించారు.
ఇక హరి హరి వీరమల్లు సినిమా పూర్తయ్యే వరకు పవన్ ఎలాంటి కొత్త ప్రాజెక్ట్స్ టచ్ చేయరని భావించిన టీమ్ కి బిగ్ షాక్ ఇచ్చాడు. ఫిబ్రవరి చివరి వారం నుండి వినోదయ సితం రీమేక్ స్టార్ట్ చేశారు. ఓకే... ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ది తక్కువ నిడివి గల పాత్ర. 25 రోజుల లోపే కేటాయించారని సర్ది చెప్పుకున్నారు. అయితే మళ్ళీ షాక్ ఇస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి తెచ్చారు. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుందట.
ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ నటించిన తేరి రీమేక్. ఈ క్రమంలో పవన్ మరోసారి రీమేక్ చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చి హరి హర వీరమల్లుకు అన్యాయం చేస్తున్నారంటున్నారు. వినోదయ సితం, తేరి రీమేక్స్ షూట్లో బిజీ కానున్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు హరి హర వీరమల్లు పూర్తి చేస్తారనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ చిత్ర బడ్జెట్ తడిసి మోపెడయ్యింది. విడుదలకు మరో ఏడాది సమయం పడితే నిర్మాతకు మిగిలేది ఏముండదు. మరి పవన్ హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నంలను ఏం చేస్తారో చూడాలి.