హనుమాన్ మూవీ ఇండియా వైడ్ సంచలనం రేపుతోంది. వందల కోట్ల వసూళ్లు రాబడుతుంది. వెండితెరపై అద్భుతం ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మకు కోట్ల విలువైన బహుమతి ఇవ్వనున్నాడట నిర్మాత.
చిన్న దర్శకులు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. ఎలాంటి అంచనాలు లేని హనుమాన్ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశాడు. హనుమాన్ మూవీ సంక్రాంతి బరిలో బడా స్టార్స్ కి పోటీగా దిగింది. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. నిర్మాతలు పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ హనుమాన్ 2024 సంక్రాంతి విన్నర్ అయ్యింది.
హనుమాన్ చిత్ర వసూళ్లు రూ. 250 కోట్ల మార్క్ దాటేశాయి. రూ. 300 కోట్లు టచ్ చేయడం ఖాయం అంటున్నారు. తేజ సజ్జా వంటి యంగ్ హీరో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అనూహ్య పరిణామం. తక్కువ బడ్జెట్ లో అత్యంత క్వాలిటీ విజువల్స్ తో సినిమాను ప్రెజెంట్ చేసి ప్రశాంత్ వర్మ ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. భారీ చిత్రాల దర్శకులు ప్రశాంత్ వర్మ దగ్గర పాఠాలు నేర్చుకోవాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హనుమాన్ మూవీతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ పెద్ద మొత్తంలో ఆర్జించారు. హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించాడు. హనుమాన్ లాభాలతో ఫిదా అయిన నిరంజన్ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మకు భారీ గిఫ్ట్ సిద్ధం చేశాడని టాలీవుడ్ టాక్. రూ. 6 కోట్ల విలువైన లగ్జరీ కారు బహుమతిగా ఇవ్వనున్నాడట. ఆల్రెడీ బుక్ కూడా చేశాడట. ఈ మేరకు ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
హనుమాన్ మూవీలో తేజ సజ్జాకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక రోల్స్ చేశారు. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. జై హనుమాన్ లో మాత్రం ఓ స్టార్ హీరో నటిస్తాడట.