
జస్టిన్ బీబర్ గురించి మ్యూజిక్ ప్రియులకు పరిచయం అవసరం లేదు. తన పాప్ మ్యూజిక్ తో జస్టిన్ బీబర్ టీనేజ్ నుంచే వరల్డ్ ఫేమస్ అయ్యాడు. సంగీత ప్రియులను ఉర్రూతలూగించే పాప్ సాంగ్స్ ఎన్నో పాడాడు. ఇప్పటికి అతడి హవా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా జస్టిన్ బీబర్ ఫిబ్రవరి 11 శుక్రవారం రోజు లాస్ ఏంజిల్స్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించాడు. మ్యూజిక్ కాన్సర్ట్ లో బీబర్ పెర్ఫామెన్స్ తర్వాత పార్టీ కూడా జరిగింది. ఈ పార్టీలో బీబర్ టీంతో పాటు కొందరు సెలెబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఏ కాన్సర్ట్ బయట ఊహించని సంఘటన జరిగింది.
కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డట్లు యుఎస్ మీడియా పేర్కొంటోంది. అనుకోకుండా కొంతమంది మధ్య పార్టీ బయటే గొడవ మొదలయింది. ఆ సమయంలో రాపర్ కొడాక్ బ్లాక్, గున్నా, లిల్ బేబీ ముగ్గురూ అక్కడే నిలబడి ఉన్నారు. కాల్పులు జరగడంతో ఈ ముగ్గురూ గాయపడ్డారు. కొడాక్ కి కాస్త తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గొడవకు కారణం ఏంటి అనే విషయంపై లాస్ ఏంజిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. డ్రేక్, లియో డికాప్రియో, టోబే మాగైర్, కెండల్ జెన్నర్, ఖోలే కర్దాషియాన్ లాంటి క్రేజీ సెలెబ్రిటీలు ఈ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
జస్టిన్ బీబర్ ఈ మ్యూజిక్ కాన్సర్ట్ లో దాదాపు అరగంట పాటు పెర్ఫామెన్స్ ఇచ్చినట్లు టాక్. కాన్సర్ట్ ప్రశాంతంగానే జరిగినా.. పార్టీ తర్వాతే ఈ ఘటన చోటు చేసుకుంది. జస్టిన్ బీబర్ టీనేజ్ వయసులో పాడిన 'బేబీ బేబీ' అనే సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని ఒక ఊపు ఊపింది.