'మహర్షి' అదనపు షోలు.. పర్మిషన్ల గొడవ!

By AN TeluguFirst Published May 8, 2019, 10:23 AM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడింది చిత్రబృందం. 

అదనపు షోలను ప్రదర్శించడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా అదనపు షోలు వేయడానికి, టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు వచ్చినట్లుగా చిత్రయూనిట్ చెబుతోంది. అయితే పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణా ప్రభుత్వం ఉదయం 8 గంటల నుండి షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ కొన్ని థియేటర్లలో ఉదయం 7 గంటల 30 నిమిషాల షోకు అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక టికెట్ రేట్ పెంచే విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు రేట్లు  పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లుగా చిత్రయూనిట్ చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన పత్రాలను బయటపెట్టడం లేదు. తెలంగాణా ప్రభుత్వం టికెట్ రేట్ పెంచడానికి అనుమతించినట్లుగా వచ్చిన వార్తలను ఖండించింది. ‘మహర్షి’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ అనుమతులతో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ. 80 నుంచి రూ. 110లు, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.138 నుండి రూ. 200ల వరకు సినిమా టికెట్ల ధరలను పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సినిమా ప్రేక్షకులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.  మరి ఈ విషయంపై 'మహర్షి' టీమ్ స్పందిస్తుందేమో చూడాలి!

click me!