
గోపీచంద్ రీసెంట్ గా `రామబాణం' చిత్రంతో పలకరించాడు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. బాగా పాత కాలం కథ,కథనాలతో సినిమా రూపొందింది అని అన్నారు. 'లక్ష్యం', 'లౌక్యం' తర్వాత స్టార్ కాంబో గోపీచంద్ - శ్రీవాస్ కలయికలో రూపొందిన మూడో చిత్రం 'రామబాణం'. ఈ సినిమా మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. సేంద్రియ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహారం అంటూ ఓ కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కానీ సినిమాను మలిచిన విధానం మాత్రం పేలవంగా ఉంది. మొదటి నుంచి చివరి వరకు ఒక్క సన్నివేశంలోనూ కొత్తదనం కనపడలేదనే విమర్శలువచ్చాయి.
ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా, ఆలోచన రేకెత్తించగలిగే నేపథ్యం.. ఇలా అన్నీ ఉన్న కథే అది. అయినప్పటికీ మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు కానీ, కాసింత హాస్యం పంచే సన్నివేశాలు కానీ మచ్చుకైనా కనిపించలేదు. ఈ స్క్రిప్ట్, దర్శకత్వం పేలవంగా ఉందని మొదటి రోజే తేల్చేసారు. ఈ నేపధ్యంలో గోపీచంద్ తదుపరి చిత్రం ఎవరితో చేస్తాడనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
అందుతున్న సమాచారం మేరకు.. కన్నడ దర్శకుడు హర్షతో ఆయన ఓ సినిమా చేయడానికి చేస్తున్నాడు. హర్ష ఇటీవల శివరాజ్ కుమార్‌తో 'వేద' అనే చిత్రాన్ని రూపొందించారు. కన్నడలో ఇది పెద్ద హిట్. తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయ్యింది.అయితే జనాదరణ కరువైంది. కానీ అదే రోజున ఓటిటిలో కూడా రిలీజ్ అవటంతో ఈ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు. కానీ కన్నడలో వచ్చిన ఫీడ్ బ్యాక్ తో.. వెంటనే గోపీచంద్ హర్షతో సినిమా చేయడానికి ముందుకొచ్చాడు.
ఇది పోలీస్ కథ అని తెలిసింది. ఇదో పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. గోపీచంద్‌కి అలాంటి కథలు బాగా సూటవుతాయని నమ్మి చేస్తున్నారు. రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇప్పటికే కొంత షూటింగ్ జరిగింది. రామబాణంతో కాస్త బ్రేక్ తీసుకున్న గోపి త్వరలోనే కొత్త షెడ్యుల్ లో జాయిన్ అవబోతున్నారు.