ఇద్దరు: సినిమాల్లో కరుణ మాటల తూటాలు, ఎంజీఆర్ నటన

First Published Aug 7, 2018, 8:49 PM IST
Highlights

కరుణానిధి సినీ రచయితగా కూడా సాంఘిక దురాచారాలపై యుద్ధం ప్రకటించారు. సాంఘిక దురాచారాలను, సామాజిక రుగ్మతలను వ్యతిరేకిస్తూ ఆయన సినిమాలు చేశారు. 

చెన్నై: కరుణానిధి సినీ రచయితగా కూడా సాంఘిక దురాచారాలపై యుద్ధం ప్రకటించారు. సాంఘిక దురాచారాలను, సామాజిక రుగ్మతలను వ్యతిరేకిస్తూ ఆయన సినిమాలు చేశారు. తన పదునైన మాటలను కత్తులుగా దూశారు. సమాజంలోని అసమానతల వ్యతిరేకించడం కోసం సినిమాలనే ఆయన ఒక బలమైన ఆయుధంగా ఎంచుకున్నారు..

తమిళ సమాజంలో వేళ్లూనుకుపోయిన అంటరాని తనం, జమీందారీ వ్యవస్థ, బ్రాహ్మణ అధిపత్యానికి వ్యతిరేకంగా సినిమాలను తీసేవారు. కరుణానిధి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం పరాశక్తి. 1952లో వచ్చిన ఈ చిత్రంలోని సంభాషణలు ఆనాటి తమిళ ప్రేక్షకుల గుండెలను బాణాల్లా తాకాయి. 

కరుణానిధి సినిమాలకు రాసిన మాటలు రాజకీయ నేతలకు ఈటెల్లా తగిలాయి. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతోనే శివాజీ గణేషన్‌ తమిళ తెరకు పరిచయమయ్యారు.

మనోహర సినిమా రచయితగా కరుణానిధి తన ప్రతిభను చాటుకున్నారు. మంత్రి కుమారా, పుదైయల్‌, పూంబుహర్‌, నేతిక్కుదండనై, చట్టం ఒరు విలయాట్టు, పాసం పరవైగల్‌, పొరుత్తుపొదుం లాంటి సినిమాలన్నీ కరుణానిధి రాసినవే. దాదాపు 39 సినిమాలకు కథలను అందించారు. రచనలు, నవలు, నాటికలు, పాటలు  రాసి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. ఆయన పుస్తకాల పురుగు కూడా. నవలలు, కథలు చదువుతూ ఉండేవారు

మాతృభాష తమిళమంటే కరుణానిధికి  లెక్కకు మిక్కిలి అభిమానం. ద్రవిడ ఉద్యమంతో ప్రారంభమైన బాషాభిమానం ఇప్పటికీ తమిళనాడులో కొనసాగుతోంది. ఇప్పటికి కూడా తమిళ సినిమా పేర్లన్ని మాతృభాషలోనే ఉంటాయి. ఈ సంప్రదాయం ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణం కరుణానిధి. 

సినిమా పేరు తమిళంలో ఉంటే పన్ను మినహాయింపు ఇస్తానని 2006లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రకటించారు.

కరుణా నిధి, ఎంజీఆర్‌ సమకాలీకులు. ఇద్దరు ఏక కాలంలో ఎదిగారు. కరుణానిధి తన కలానికి పదును పెడితే, దానికి ఎంజీఆర్ ప్రాణ ప్రతిష్ట చేస్తూ వచ్చారు. ఇద్దరు కూడా ప్రాణ మిత్రులు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది. 

వీరిద్దరిపై మణిరత్నం ఇద్దరు సినిమా తీశారు. కరుణానిధి 2011వరకు కథలు రాస్తూనే వచ్చారు. ఆయన రాసిన ‘పొన్నార్‌ శంకర్‌’ నవల ఆధారంగా పొన్నార్‌ శంకర్‌ పేరుతో 2011 సినిమా వచ్చింది. 
 

click me!