
నేచురల్ స్టార్ నాని చాలా కాలంగా ఫ్యామిలీ, కామెడీ జోనర్‌లో ఇరుక్కుపోయాడు. ఇన్నాళ్లు ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు. దీంతో ఆయన సినిమాలు యావరేజ్ ఫలితాలనే వస్తున్నాయి. పాజిటివ్ టాక్ ఉన్నా, కలెక్షన్ల పరంగా మామూలుగానే ఉంటున్నాయి. యాభై కోట్లు దాటే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నాని ఫస్ట్ టైమ్ తన సేఫ్ జోన్ నుంచి బయటకొచ్చాడు. ప్రయోగం చేశాడు. అది మామూలు ప్రయోగం కాదు, `దసరా` వంటి రా అండ్ రస్టిక్, తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో ఊరమాస్ మూవీ చేశాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.
శ్రీరామనవమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న మార్చి 30న `దసరా` చిత్రం రిలీజ్ అయ్యింది. నాని నటించిన ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఇది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది. ఈ చిత్రానికి మొదటి షోకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. తెలుగులోనూ యావరేజ్ మూవీగా తేల్చేశారు. కలెక్షన్లు కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం 38కోట్లు వరల్డ్ వైడ్‌గా కలెక్ట్ చేసినట్టుగా చూపించారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి `పుష్ప` మ్యాజిక్ రిపీట్ అవుతుందా? నాని పాన్ ఇండియా స్టార్ అవుతాడా? అనేది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎందుకంటే నార్త్ లో మాస్ సినిమాలో జోరు సాగుతుంది. మాస్ యాక్షన్, రా, రస్టిక్‌గా ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. గతంలో `పుష్ప` ఇలానే ఆకట్టుకుంది. అలాగే `కాంతార`, `విక్రమ్`, `కేజీఎఫ్2`, `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలు అలానే నార్త్ లో విశేషంగా ఆదరణ పొందాయి. ఊహించని కలెక్షన్లతో ఆయా చిత్రాల మేకర్స్ కి, ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చాయి. ఆయా చిత్రాలతో హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. ఇప్పుడు అదే మ్యాజిక్ నాకి, `దసరా`కి రిపీట్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పైన చెప్పుకున్న సినిమాల మాదిరిగా `దసరా`లో రా, రస్టిక్ కంటెంట్ ఉంది. ఊరమాస్ అంశాలున్నాయి. మాస్, యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నాయి. మాస్ పాటలు ఉన్నాయి. దీనికితోడు రామాయణం, రావణాసురుడు అంశాలున్నాయి. ఇవన్నీ యూనివర్సల్ అప్పీల్ ఉన్న అంశాలు. ఇక ప్రేమ కోసం చేసే పోరాటం కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్నదే. ఇవన్నీ నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికితోడు నాని అద్భుతమైన నటన, ఎన్నడూ లేని విధంగా మాస్ లుక్‌లో ఇరగదీశాడు.
దీనికితోడు క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఇందులో దసరా పండుగ రోజు రావణ దాహనం అనేది ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే అంశం. పైగా ఆ సమయంలో ఫైట్ సీన్లు, విలన్‌ని చంపే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ ఫైట్ సీన్ సినిమాలో బలమైన పాత్ర పోషిస్తుంది. మరోవైపు నార్త్ లో పేరున్న శరత్ కేల్కర్ వాయిస్ సైతం నార్త్ కి బాగా కనెక్ట్ అయ్యే అంశం. `దసరా`లో నానికి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాని నార్త్ లో బాగా ప్రమోషన్స్ చేశారు. ఇంటర్వ్యూలు, ఇవెంట్లు ఏర్పాటు చేశారు. ముంబాయిలో మాత్రమే కాదు, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాలను చుట్టేశారు. `దసరా` సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఇది కూడా ఈ సినిమాపై చర్చకి దారితీస్తుందని చెప్పొచ్చు. ఇవన్నీ ఓ ఎత్తైతే నార్త్ లో ఇప్పుడు చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. అజయ్‌దేవగన్ నటించిన `భోళా` చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. రేపటితో ఈ సినిమా క్లోజ్ కాబోతుంది. దీంతో అది `దసరా` సినిమాకి కలిసొచ్చే అంశం. మాస్ అంశాలున్న ఈ చిత్రం నార్త్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే ఇది మున్ముందు పికప్ అందుకేనే ఛాన్స్ ఉంది. బాగుందనే మౌత్ టాక్ ప్రారంభమయ్యిందంటే చాలా కాస్త లేట్ అయినా పుంజుకుంటుంది. `పుష్ప` సినిమా విషయంలో అదే జరిగింది. మరి ఆ మ్యాజిక్ ఇప్పుడు `దసరా`కి రిపీట్ అవుతుందా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే `దసరా` చిత్రంలో చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. బలమైన సాంగ్స్ లేవు. పుష్పలో ఊ అంటావా మావ.. ` లాంటి ఊపేసే సాంగ్స్ లేవు. కథలో బలమైన కాంన్ల్ఫిక్ట్ లేదు. బలమైన కథ లేదు. హీరోయిజం బలంగా పండలేదు. బలమైన విలన్ లేడు. స్లో నెరేషన్ ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. దీనికితోడు తాగుడు సన్నివేశాలు శృతి మించడం కూడా దీనికి నెగటివ్‌గా మారిందని చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే యావరేజ్ ఫలితాలున్నాయి. తమిళం, కన్నడ, హిందీలో కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. మరి వీటిని దాటుకుని నాని నార్త్ లో సత్తా చాటుతాడా? `దసరా`తో మ్యాజిక్ చేస్తాడా? అనేది చూడాలి.