
ప్రముఖ కన్నడ నటుడు చేతన్ అహింసపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. చేతన్ తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదు మేరకు శేషాద్రిపురం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం చేతన్‌ను విచారణకు పిలిపించనున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ఇటీవల విడుదలైన కాంతారా చిత్రం మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భూత కోలా’’ హిందూ సంస్కృతిలో భాగమని అన్నారు.
ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన రిషబ్ శెట్టి.. “ఆ దేవుళ్ళు.. వారంతా మన సంప్రదాయంలో భాగమే. కచ్చితంగా ఇది హిందూ సంస్కృతి, ఆచారాలలో భాగం. నేను హిందువును కాబట్టి.. నా మతంపై నాకు నమ్మకం, గౌరవం ఉంది. కానీ ఇతరులు తప్పు అని నేను చెప్పను. మేము ఏదైతే చెప్పామో.. అది హిందూ ధర్మంలో ఉంది. నేను హిందువుని. నా మతం, ఆచారాలను నేను నమ్ముతాను. ఎవరూ దీనిని ప్రశ్నించలేరు.’’ అని అన్నారు.
దీనిపై స్పందించిన చేతన్.. “మా కన్నడ చిత్రం ‘కాంతారా’ జాతీయ స్థాయిలో అలరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. దర్శకుడు రిషబ్ శెట్టి భూత కోలా 'హిందూ సంస్కృతి' అని పేర్కొన్నారు. అది తప్పు. మన పంబాడ/నాలికే/పరవ బహుజన సంప్రదాయాలు వైదిక-బ్రాహ్మణ హిందూ మతానికి పూర్వం ఉన్నాయి. మూల్నివాసి సంస్కృతులను తెరపై, బయట వాస్తవంగా చూపించాలని మేము కోరుతున్నాం’’ అని ట్వీట్ చేశారు.
అలాగే ఇదే విషయాన్ని చేతన్ బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కూడా మరోసారి వెల్లడించారు. ‘హిందూ’ అనే పదాన్ని ఎలా ఉపయోగించారనేది ముఖ్యమని అన్నారు. ‘‘భూత కోలా హిందూ మతంలో భాగమని చెప్పడం తప్పు. ఆదివాసీలు ఆచారాన్ని పాటిస్తారు. భూత కోలాలో ‘బ్రాహ్మణత్వం’ లేదు. సినిమాలో హిందూ అని చెప్పకండి. ఇది ఆదివాసీల సంస్కృతి. హిందూ మతం కాలమ్‌లో ఆదివాసీ సంస్కృతిని ఉంచవద్దు’’ అని చేతన్ అన్నారు.
దీంతో శివకుమార్ అనే వ్యక్తి చేతన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేతన్ చేసిన వ్యాఖ్యలు మతపర మనోభావాలను దెబ్బతినేలా, రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 505(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా చేతన్‌పై ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
ఇక, ఈ ఏడాదిలో చేతన్‌పై నేరారోపణలు రావడం ఇది రెండోసారి. ఫిబ్రవరిలో హిజాబ్ వివాదం సమయంలో విచారణలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన ట్వీట్లు చేసినందుకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.