
జనవరి 27న తారకరత్న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సిబ్బంది, కార్యకర్తలు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు అర్థరాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు నారాయణ హృదయాల ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. తారకరత్న కండీషన్ అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్స్ ప్రకటన అభిమానులను వేదనకు గురి చేసింది.
తారకరత్న కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అనూహ్యంగా తారకరత్న ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు గమనించారు. ప్రధాన అవయవాలైన గుండె, లివర్, కిడ్నీలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. అయితే మెదడులో సమస్య ఏర్పడింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న గుండె 45 నిమిషాల పాటు అచేతన స్థితిలో ఉంది. దీంతో మెదడుకు రక్త ప్రసరణ జరగలేదు. మెదడు పై భాగం వాపుకు గురై, నీరు చేరినట్లు వైద్యుల పరీక్షలో తేలింది.
మెడలో సమస్య ఏర్పడిన నేపథ్యంలో తారకరత్న కోమాలోనే ఉండిపోయారు. తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లాలని వైద్యులు భావించారు. అయితే వైద్యులనే ఇక్కడికి పిలిపించారని సమాచారం. సోమవారం లేదా మంగళవారం తారకరత్న హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఆశించినట్లు ఎలాంటి హెల్త్ బులెటిన్ రాలేదు.
తారకరత్నకు ఎలా ఉందో చెప్పకుండా డాక్టర్స్ సైలెంట్ అయ్యారు. మరోవైపు తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. బాలకృష్ణ యజ్ఞ యాగాదులు చేస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రయత్నాలు ఫలించాలని అందరూ కోరుకుంటున్నారు.