'ఎక్కడికిపోతావు చిన్నవాడా' రివ్యూ

Published : Nov 18, 2016, 12:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
'ఎక్కడికిపోతావు చిన్నవాడా' రివ్యూ

సారాంశం

టైటిల్ : ఎక్కడికి పోతావు చిన్నవాడా నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, నందితా శ్వేత, హెబా పటేల్,  వెన్నెల కిశోర్ సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : విఐ ఆనంద్ నిర్మాత : పి.వి.రావు

 

 

నిఖిల్ ఇటీవల శంకరాభరణం సినిమాతో నిరాశపరిచాడు. దీంతో గతంలో తాను ఎంచుకున్న పంధాలోనే తిరిగి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ చేశాడు. స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నిఖిల్ శంకరాభరణం ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డాడు. ఈ యంగ్ హీరో రొటీన్ కమర్షియల్ జోనర్ పక్కన పెట్టి మరోసారి తనకు బాగా కలిసొచ్చిన ప్రయోగానికే మొగ్గు చూపాడు... రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నిఖిల్ కెరీర్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చిందా..? చూద్దాం...


కథ :
హీరో ఇంజనీరింగ్ స్టూడెంట్ అర్జున్(నిఖిల్)... ఎగ్జామ్ రాసిన వెంటనే తనను ప్రేమించిన అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ వెళ్తాడు. కానీ ఎంత సేపు ఎదురుచూసినా అయేషా అక్కడికి రాదు. దీంతో అయేషా తనను మోసం చేసిందని భావిస్తాడు. తర్వాత అయేషాను మరిచిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టిన అర్జున్, గ్రాఫిక్ డిజైనర్ గా సెటిల్ అవుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ అన్న కిశోర్( వెన్నెల కిశోర్) వింతగా ప్రవర్తిస్తుండటంతో అతడికి వైద్యం చేయించడానికి కేరళ తీసుకెళతాడు. అక్కడ అమల అనే అమ్మాయి అర్జున్ కు పరిచయమవుతుంది. ఇద్దరు దగ్గరవుతారు. తెల్లవారితే ప్రేమ విషయం చెప్తుంది అనుకున్న సమయంలో.. అమల అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లిన అర్జున్.. ఆమె చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు.

తరువాత అర్జున్ కు కేరళలో కలిసిన అమ్మాయి హైదరాబాద్ లో కనిపిస్తుంది. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని హీరోకు అర్థం అవుతుంది. అదే సమయంలో మరోసారి అమల నుంచి అర్జున్ కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నా అని ఫోన్ చేసి చెపుతుంది అమల. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
విభిన్న కథలను ఎంచుకొని సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మరోసారి సక్సెస్ సాధించాడు. కాలేజ్ స్టూడెంట్ గా, కెరీర్లో సెటిల్ అయిన వ్యక్తిగా రెండు లుక్స్ లో మంచి వేరియేషన్ చూపించాడు. తన ప్రతీ సినిమాకు నటుడిగా మరో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హార్రర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. హేబా పటేల్ మరోసారి అల్లరి పిల్లగా.. అలరించింది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అవికా ఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


సాంకేతిక నిపుణులు :
టైగర్ సినిమాతో దర్శకుడిగా మారిన విఐ ఆనంద్ రెండో ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్‑నే నమ్ముకున్నా.. ఎక్కడా రొటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‑తో సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్‑లో వచ్చే సాంగ్స్ విజువల్‑గా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమా మూడ్‑కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ కు ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ జోడించి కథ చెప్పిన విధానం బాగుంది. సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఎదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కొత్తదనమున్న కామెడీ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సత్య.. పంచ్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అలాగే ఫస్టాఫ్ ఓపెనింగ్ ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ థ్రిల్ అయితే సెకండాఫ్ లో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచింది. ఇక సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ సెకండాఫ్ లో వచ్చే అమల పాత్రను పోషించిన నటి నందితా శ్వేతా నటన. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక ఆత్మగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆమెపై నడిచే సన్నివేశాలు ప్రతిదీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ రొటీనే అయినప్పటికీ అందులో నటనతో దానికి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది నందితా శ్వేత. హీరో నిఖిల్, హెబ్బా పటేల్ ల నటన కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ రన్ టైమ్ లో నడిచే సినిమా బోరింగానే సాగింది. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్ పడే వరకూ ఎక్కడా రిలీజ్ దొరకలేదు. దర్శకుడు ఆ పార్ట్ ని ఇంకాస్త పక్కాగా రాయాల్సింది. ఇక సెకండాఫ్ కూడా కాస్త బలం లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ రొటీన్ గానే ఉంది. క్లైమాక్స్ అద్దిరిపోయేలా ఉంటుందనుకుంటే.. అన్ని సినిమాల్లాగే పాతగానే సాగి నిరుత్సాహపరిచింది.

చివరగా... ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నిఖిల్ ఎక్కడికీ పోడు

రేటింగ్-3.25/5

PREV
click me!

Recommended Stories

శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today: టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మీనా, పోటీకి పోయి కాళ్లు విరగ్గొట్టుకున్న ప్రభావతి