
కథలో దమ్ము ఉండాలే కానీ భాషతో సంబంధం లేదని ఈ సినిమా నిరూపించే కొన్ని సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలు అన్ని భాషల్లోనూ రీమేక్ అవుతూంటాయి. అలాగే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సినిమా ఎంతటి సెన్సేషన్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ఇదే టైటిల్ తో తెలుగులో విక్టరీ వెంటేష్ హీరోగా ఈ సినిమా రీమేక్ అయ్యి మంచి విజయాన్నిసొంతం చేసుకుంది. ఆ తర్వాత మళయాళంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం2 వచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా దృష్ట్యా ఈ చిత్రాన్ని మలయాళంలో ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ చేసి ఓటీటిలోనే విడుదల చేసారు. అదీ మంచి విజయం సాధించింది. ఆ దృశ్యం ఫ్రాంఛైజీ ఇప్పుడు గ్లోబల్ లెవల్ కు వెళ్తోంది.
దృశ్యం మూవీని హాలీవుడ్ లో రీమేక్ చేయబోతుండటం విశేషం. ఈ విషయాన్ని గురువారం (ఫిబ్రవరి 29) ప్రొడక్షన్ హౌజ్ పనోరమా స్టూడియోస్ వెల్లడించింది. గల్ఫ్‌స్ట్రీమ్ పిక్చర్స్, జేఓఏటీ ఫిల్మ్స్ తో కలిసి తాము హాలీవుడ్ రీమేక్ చేయనున్నట్లు తెలిపింది. మలయాళంలో మూవీని రూపొందించిన ఆశిర్వాద్ సినిమాస్ నుంచి పనోరమా స్టూడియోస్ అంతర్జాతీయ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.
దృశ్యం స్టోరీని అంతర్జాతీయ ప్రేక్షకులతో పంచుకోబోతున్నందుకు సంతోషంగా ఉందని ఈ పనోరమా స్టూడియోస్ సీఎండీ కుమార్ మంగత్ పాఠక్ అన్నారు. ప్రస్తుతం కొరియా, హాలీవుడ్ లలో దృశ్యం తీసిన తర్వాత వచ్చే ఐదేళ్లలో మరో పది దేశాల్లోనూ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
దృశ్యంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేయగా వెంకటేశ్, మీనా నటించారు. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. హిందీలో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. పాపనాశం పేరుతో తమిళ్‌లో తెరకెక్కగా కమల్ హాసన్, గౌతమి నటించారు. కన్నడలో దృశ్య పేరుతో రూపొందింది. ఇలా అన్నీ భాషల్లోనూ సక్సెస్‌ను అందుకుంది. అనంతరం తొలి భాగానికి సీక్వెల్‌గా దృశ్యం 2 రూపొందించగా ఇది కూడా విజయం సాధించింది. తెలుగులో అయితే వెంకటేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలను కొరియన్‌లోనూ రీమేక్ చేశారు. అక్కడ కూడా మాతృక తరహాలోనే భారీ విజయాన్ని అందుకున్నాయి . కాగా, త్వరలోనే దృశ్యం 3 కూడా మలయాళంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.