
కమల్ హాసన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారన్న వార్త కలకలం రేపింది. కళాతపస్వి కె విశ్వనాథ్ గారిని కలిసేందుకు కమల్ నిన్న హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. విశ్వనాథ్ గారిని కలిసిన అనంతరం కమల్ చెన్నై పయనమయ్యారు. నివాసానికి చేరిన కమల్ శ్వాస సమస్యతో ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. జ్వరం లక్షణాలు కూడా కనిపించాయి. దీంతో శ్రీరామచంద్ర ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కమల్ ఆసుపత్రిలో చేరిన విషయం బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు.
కమల్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం శ్రీరామచంద్ర ఆసుపత్రి వర్గాలు కమల్ హాసన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కమల్ హాసన్ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఆ సమస్యలతోనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రేపు లేదా ఎల్లుండి డిశ్చార్జ్ అవుతారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైద్యుల ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6 నడుస్తుంది. వ్యాఖ్యాతగా ఉన్న కమల్ హాసన్ వీకెండ్ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూట్స్ లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కమల్ ఈ వీకెండ్ మిస్ అయ్యే సూచనలు కలవు. మరోవైపు కమల్ భారతీయుడు 2 షూట్ లో పాల్గొంటున్నారు. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు సీక్వెల్ షూట్ తిరిగి ప్రారంభమైంది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. మూడు దశాబ్దాల తర్వాత కమల్-మణిరత్నం మూవీ కోసం చేతులు కలిపారు.
ఇక కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్ భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ కి విక్రమ్ రూపంలో భారీ కమర్షియల్ హిట్ పడింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.