సూపర్ స్టార్ కృష్ణ మృతికి కారణం అదేనా?.. కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు ఏం చెప్పారంటే..

By Sumanth KanukulaFirst Published Nov 15, 2022, 11:10 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంపై మీడియాతో మాట్లాడిన కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు.. పలు వివరాలను వెల్లడించారు. కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరడం జరిగిందన్నారు. ఆస్పత్రికి తీసుకురాకముందే ఆయన స్పృహ కోల్పోయారని చెప్పారు. 

‘‘ఆస్పత్రికి తీసుకొచ్చాక వెంటనే చికిత్స ప్రారంభించాం. ఆస్పత్రికితీసుకొచ్చినప్పటీ నుంచి ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. 20 నిమిషాలు సీపీఆర్‌ చేశాం. అనంతరం ఐసీయూకు తరలించాం. రెండు మూడు గంటల్లో పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. 4  గంటల తర్వాత డయాలసిస్ చేశాం. గంట గంటకు కుటుం సభ్యులతో మాట్లాడాం. సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింతగా విషమించింది. సాయంత్రం 8 గంటల సమయంలో  ఏ ట్రీట్‌మెంట్ చేసిన ఫలితం ఉండదనే నిర్దారణకు వచ్చాం. 

ఆయనను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా.. మన:శాంతిగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణ విషయంలో వైద్యనీతిని పాటించాం. ఆయనకు చికిత్స అందించడం మేము గౌరవంగా భావిస్తున్నాం. గుండెపోతు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో పాటు.. హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజ్యూరీ కూడా అయింది. ఆయన ఎలాంటి చికిత్సకు సహకరించే పరిస్థితి లేకపోవడంతోనే చికిత్సను ఆపేశాం. చివరి క్షణాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం’’ అని వైద్యులు చెప్పారు. 

ఇదిలా ఉంటే.. కృష్ణకు సీటీ స్కాన్ చేసినప్పుడు.. హైపాక్సిక్ డ్యామేజ్ తీవ్రంగా ఉన్నట్టుగా గుర్తించినట్టుగా వైద్యులు చెప్పారు. ప్రపంచంలో ఈ సమస్య నుంచి బయటపడిన ఘటనలు చాలా  తక్కువగా ఉన్నాయని తెలిపారు. కృష్ణ చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయం జరిగిందన్నారు.

ఇక, సూపర్‌స్టార్ కృష్ణ మృతిపై ప్రకటన విడుదల చేసిన కాంటినెంటల్ ఆస్పత్రి.. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యుల ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరింది. 

click me!