
నట శేఖరుడు, సాహసాల వీరుడు సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త సినీ లోకాన్ని కలిచివేస్తోంది. ఈరోజు (నవంబర్ 15న) ఉదయం ఆయన ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణ... మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, టాలీవుడ్ స్టార్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తీవ్రంగా చింతిస్తున్నారు. ట్వీటర్ వేదికన నివాళి అర్పించారు. ట్వీట్ చేస్తూ.. ‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి వూపిరి, ధైర్యానికి పర్యాయపదం, ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు, భారత సినీపరిశ్రమ లోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకి నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియచేసుకొంటున్నాను..’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా సంతాపం వ్యక్తం చేశారు. 'ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ప్రకటన విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతికి గురయ్యారు. చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన శ్రీ కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన శ్రీ కృష్ణ గారు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా శ్రీ కృష్ణ గారు చేసిన సేవలు చిరస్మరణీయాలు. కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. ఆయన కుమారుడు శ్రీ మహేష్ బాబు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అంటూ భావోద్వేగం అయ్యాడు.
కృష్ణ లేరనే చేధు నిజాన్ని కింగ్, అక్కినేని నాగార్జున జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో ఓరిజినల్ కౌ బాయ్ కృష్ణ అని కొనియాడారు. ఎలాటి జోనర్ లోనైనా భయం లేకుండా సినిమాలు తీయగలిగిన నటుడు కృష్ణనే అన్నారు. అలాంటి గొప్ప నటుడు, వ్యక్తి ని కోల్పోవడం బాధాకరంగా ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. జానర్ లో సినిమాను అలాగే అలనాటి హీరో ఆర్ శరత్ కుమార్ కూడా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ట్వీటర్ వేదికన కృష్ణతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ.. సంతాపం ప్రకటించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా కృష్ణ మరణానికి చింతిస్తున్నారు. ‘కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం.’ అంటూ ట్వీటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అలాగే మాస్ మహారాజ రవితేజ, నాని, మంచు మనోజ్, నిఖిల్, దర్శకుడు అనిల్ రావిపూడి కృష్ణ మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్వీటర్ వేదికన ఆయనకు నివాళి అర్పించారు. కృష్ణ గారి గొప్ప మనస్సు, చలన చిత్ర రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.