
ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో విడుదలైన `కలర్‌ఫోటో`(Colour Photo) చిత్రానికి జాతీయ అవార్డు (National Award) దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చిరు, పవన్ వంటి బిగ్ స్టార్స్ సైతం ఈసినిమాని అప్రిషియేట్ చేశారు. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ వంశీపైడిపల్లి ప్రశంసలు కురిపించారు. ఇది తెలుగు సినిమా సెలబ్రేట్ చేసుకునే టైమ్ అని అన్నారు.
68వ నేషనల్ అవార్డుల్లో `కలర్ ఫోటో` చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేని ఈసినిమాకి నేషనల్ అవార్డు దక్కడంతో ప్రతిభకి పట్టం కట్టినట్టే అని సెలబ్రిటీలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ సినిమాకి దర్శకుడు వంశీపైడిపల్లితోపాటు `ఆహా` నిర్వహకులు అభినందనలు తెలియజేస్తూ, టీమ్‌ని అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ `ఆహా`లో విడుదలైన నేపథ్యంలో సదరు ఓటీటీ సంస్థ ప్రత్యేకంగా టీమ్‌ని సత్కరించింది.
ఈ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్న వంశీపైడిపల్లి `కలర్‌ఫోటో`కి అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. `కలర్ ఫోటో చిత్రానికి జాతీయ అవార్డు రావడం సినిమాకి మాత్రమే కాదు, తెలుగు సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు. ఇలాంటి గుర్తింపు వస్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడొచ్చనే అనిపిస్తుందని, తెలుగు సినిమాలో ఇప్పటి వరకు అవార్డు వచ్చిన చిత్రాల్లో `కలర్ ఫోటో` 68వ సినిమాగా నిలిచిందన్నారు వంశీపైడిపల్లి. ఇది చాలా గర్వకారణమని, విజ్ఞాన్ భవన్‌లో అవార్డు అందుకునే సమయంలో కలిగే ఫీలింగ్ ఎప్పటికీ గుర్తిండిపోతుందన్నారు.
`నేషనల్ అవార్డు అనేది మన ఇంటి గోడ మీదుంటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం, రూంలో కెమెరాలు పెట్టుకుని చిన్న చిన్న స్కిట్లు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు సుహాస్, సందీప్, సాయి రాజేష్, కాళభైరవ. నిజాయితీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాషన్, కమిట్‌మెంట్, హార్డ్ వర్క్ తోనే టీం అంతా కలిసి పనిచేయడంతోనే ఈ గుర్తింపు వచ్చింది. సినిమా క్లైమాక్స్ లో చాందిని నటనను చూసి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అప్పుడే ఈ సినిమా స్థాయి అర్థమైంది. `అల వైకుంఠపురములో` సినిమాకు గానూ తమన్‌కు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆహా, కలర్ ఫోటో టీంకు కంగ్రాట్స్` అని చెప్పారు వంశీపైడిపల్లి.
హీరో సుహాస్ మాట్లాడుతూ, `మా నిర్మాతలు సాయి రాజేష్, బెన్నీ అన్నలకు థ్యాంక్స్. వాళ్లు నమ్మి నన్ను హీరోగా పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగింది. సాయి రాజేష్ అన్న స్టోరీ ఇచ్చి హీరోగా చేయ్ అన్నప్పుడు నాకు భయం వేసింది. మొత్తానికి చేశాం. చాలా హ్యాపీగా ఉంది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్, సినిమాకి అవార్డు రావడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి’ అని అన్నారు.
`లాక్డౌన్ తరువాత ఆహాలో ఈ చిత్రం విడుదలైంది. ఎక్కడికీ వెళ్లినా ఆ సినిమాతో మమ్మల్ని గుర్తిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు రావడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. థియేటర్‌లో వచ్చే కలెక్షన్లతో ఓ వ్యాల్యూ వస్తుంది, కానీ మాది ఓటీటీలో వచ్చింది. నిజంగానే మాకు అంత రీచ్ వచ్చిందా? అనే అనుమానం ఉంది. కానీ నిజంగానే మంచి సినిమా తీశామని మాకు ఇప్పుడు అర్థమైంది. నిజాయితీతో సినిమా తీస్తే అందరూ సినిమాను ప్రేమిస్తారని అర్థమైంది. ఆటోవాలా నుంచి ఢిల్లీలో కూర్చున్న జ్యూరీ వాళ్లకు కూడా నచ్చుతుందని అర్థమైంది. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అందరికీ థ్యాంక్స్. ఈ అవార్డు రావడంతో మా మీద ఇంకా బాధ్యత పెరిగింది. ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తాం` అని చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ చెప్పారు.
దర్శక నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ, `జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రశాంతంగా జరిగిందని అంతా అనుకుంటారు. కానీ దాని వెనకాల ముగ్గురున్నారు. నా మొదటి చిత్రం ఏడాదిన్నర, రెండేళ్లు తీశాను. రెండో సినిమా ఐదేళ్లు తీశాను. మూడో సినిమా 38 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ఆరు నెలల్లో విడుదల చేశాను. దీనికి కారణం ముగ్గురు వ్యక్తులు. అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్ వల్లే ఈ సినిమా ఎంతో సులభంగా పూర్తయింది.ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఈ రేంజ్ రీచ్ వచ్చేది కాదు. ఈ రేంజ్ సక్సెస్ వచ్చేది కాదు.
సినిమాకు ఫస్ట్ ఆడియెన్ వంశీ పైడిపల్లి. ఫస్ట్ కట్ చేశాక నేను భయపడ్డాను. ఇది కచ్చితంగా ఆహా వాళ్లకు చూపించకూడదని అనుకున్నాను. దాచి పెట్టి ఎన్నో రిపేర్లు చేశాను. ఆ తరువాత ఒక రోజు వంశీ పైడిపల్లి గారికి చూపించాను. ఆ రోజు వంశీ గారు, రామ్ గారు ఇచ్చిన హగ్‌తో హిట్ కొట్టేశామని అనిపించింది. నాకు ఇంత హెల్ప్ చేసి, ఇంత రీచ్ ఇస్తున్న అరవింద్, బన్నీ వాసు, ఎస్‌కేఎన్, ఆహా టీంకు థ్యాంక్స్. ఒక చిన్న సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో పెద్దవాళ్లంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ చాందినీ చౌదరి, నటి దివ్య, కమేడియన్ హర్ష, వాసు, కార్తీక్, నిర్మాత ఎస్‌కేఎన్ పాల్గొని అభినందనలు తెలిపారు.