ఎవడాపుతాడో చూస్తా...దర్శకుడు తేజ వార్నింగ్‌

By telugu teamFirst Published May 23, 2019, 1:05 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు తేజ తాజా చిత్రం ‘సీత’. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం మొదలైంది. 

 

ప్రముఖ దర్శకుడు తేజ తాజా చిత్రం ‘సీత’. ఈ చిత్రం రేపు విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రం టైటిల్ విషయంలో వివాదం మొదలైంది. టైటిల్ మార్చాల్సిందే అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో  టైటిల్‌లో ఎలాంటి మార్పులు చేయనని తేల్చి చెప్పారు దర్శకుడు తేజ.  టైటిల్‌ మార్చాలని, సినిమాను తమకు చూపించిన తర్వాతే విడుదల చేయాలని అని డిమాండ్ చేయటాన్ని ఆయన తప్పు పట్టారు.

తేజ  మాట్లాడుతూ..‘ ‘సీత’ కాకపోతే శూర్పణఖ అని టైటిల్‌ పెట్టాలా? నేనెందుకు మార్చాలి టైటిల్‌? నేను అస్సలు మార్చను. ‘సీత’ సినిమా ఇలాగే ఉంటది. సెన్సార్‌ బోర్డు కూడా సర్టిఫికేట్‌ ఇచ్చేసింది. కాబట్టి నేను ఎవ్వరికీ సినిమా చూపించాల్సిన అవసరం లేదు.ఖచ్చితంగా రేపు విడుదల చేస్తాను. ఎవడు ఆపుతాడో చూస్కుంటా’ అని హెచ్చరించారు.

వివాదం విషయానికి వస్తే..  బెల్లంకొండ హీరోగా.. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్రలో నటించిన ‘సీత’ టైటిల్‌పై BJYM అభ్యంతరం వ్యక్తం చేసి షాక్ ఇచ్చింది. సినిమాకు ‘సీత’ టైటిల్ పెట్టడంపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. ఈ సినిమాలో సీత క్యారెక్టర్‌తో పలు అభ్యంతరక డైలాగులు చెప్పించడంపై వాళ్లు మండిపడుతున్నారు.

 ‘సీత’ అనే పవిత్రమైన పేరు పెట్టి.. ఈ క్యారెక్టర్‌తో డైరెక్టర్ బూతులు చెప్పించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టైటిల్ పెట్టి దర్శకుడు హిందువుల సెంటిమెంట్‌తో ఆటలు ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద హిందువుల ఆరాధ్యదేవతైన ‘సీత’ పేరుతో ఎలా పడితే అలా సినిమా తీస్తే  ఊరుకునేది లేదన్నారు.

వెంటనే డైరెక్టర్ ఈ సినిమా టైటిలైన ‘సీత’ టైటిల్‌తో పాటు.. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్‌తో చెప్పించిన బూతు డైలాగులను తొలగించడంతో పాటు హిందువుల మనోభావాలను కించపరిచినందుకు ఈ సినిమా దర్శక,నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్‌లో ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక మెమరాండం సమర్పించారు. ఒకవేళ మేం చెప్పిన డిమాండ్లు ఒప్పుకోకపోతే..ఐపీసీ సెక్షన్ 295(1),502 (2) కింద దర్శక,నిర్మాతలపై కేసు నమోదు చేస్తామన్నారు.

click me!