శ్రీమంతుడు కాంట్రవర్సీ... డైరెక్టర్ కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

By Mahesh Jujjuri  |  First Published Jan 29, 2024, 6:37 PM IST

డైరెక్టర్ కొరటాల శివకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు సినిమా కథకు సబంధించిన కాంట్రవర్సీలో కేసు ఎదుర్కొంటున్న ఆయనకు సుప్రీమ్ లో కూడా ఊరట లభించలేదు. ఇంతకీ విషయం ఏంటంటే..?
 



మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన శ్రీమంతుడు సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న మహేష్ కు శ్రీమంతుడు సినిమాతో హిట్ ఇచ్చాడు కొరటాల. కాని ఈసినిమా ఎంత సక్సెస్ సాధించిందో.. అంత వివాదాలను కూడా మూటగట్టుకుంది. 2015లో వచ్చిన ఈ సినిమా కథ విషయంలో కాంట్రవర్సీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. 

స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. శ్రీమంతుడు సినిమాను స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా తీశారని, తన కథను మక్కికిమక్కి కాపీ కొట్టారని శరత్‌చంద్ర అనే రచయిత హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ గతంలో కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. 

Latest Videos

అయితే శ్రీమంతుడు కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను విచారణ సమయంలో  శరత్‌ చంద్ర కోర్టుకు సమర్పించారు. అవి నిజమైనవేనని నిర్ధారిస్తూ,  రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది. దాంతో ఎలాగైన తనకు ఊరట కలిగించాలి అని డైరెక్టర్ కొరటాల శివ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. శివ దాఖలు చేసిన  పిటిషన్‌పై జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాల ధర్మాసనం విచారణ జరిపింది. సినిమా విడుదలైన ఎనిమిది  నెలల తర్వాత శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని,  హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను ఎక్కడా పరిగణనలోకి తీసుకోలేదంటూ కొరటాల తరపున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదించారు. 

ఇక రచయితల సంఘం నివేదిక ఆధారంగా మాత్రమే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, కాని తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని తేల్చి చెప్పింది. పిటిషన్‌ను మమ్మల్ని డిస్మిస్‌ చేయమంటారా? లేక మీరే వెనక్కి తీసుకుంటారా అని సుప్రీం కోర్టు కొరటాల తరపు లాయర్ నిరంజన్‌రెడ్డిని ప్రశ్నించింది. పిటిషన్‌ను తామే  వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో అందుకు అనుమతి ఇచ్చింది.

click me!