
బాలయ్యబాబుతో జీవితాంతం నా జర్నీ ఇలానే విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటున్నా` అని అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. `అఖండ` చిత్రాన్ని బాలయ్య అభిమానులతోపాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఆదరించారని, అందుకే ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ సాధించిందని చెప్పారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం `అఖండ`. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా, శ్రీకాంత్ విలన్‌గా, పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
`అఖండ` సినిమా డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దాదాపు 130కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా థియేటర్లలో సినిమా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కర్నూల్‌లో ఈ చిత్ర శతదినోత్సవ వేడుకని `అఖండ కృతజ్ఞత సభ` పేరుతో నిర్వహించారు. ఈ సందర్బంగా దర్శకుడు బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమోషనల్ అయ్యారు.
తన తొలి సినిమా `భద్ర`, రెండో చిత్రం `తులసి` తర్వాత బాలయ్యతో మూడో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని, ఆయన కెరీర్ లెగసీని చూసి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఓ ప్రయోగాత్మకంగా `సింహ` చిత్రం చేశామని, దాన్ని ఆడియెన్స్ అద్భుతంగా ఆదరించారని, ఆ చిత్రంతో తన తొలి అడుగు పడిందన్నారు. `లెజెండ్`తో రెండో అడుగు, `అఖండ`తో మూడో అడుగు పడిందని చెప్పారు బోయపాటి. ఈ మూడు సినిమాలతో బాలయ్య అభిమానులు తనని వారి ఫ్యామిలీ మెంబర్‌ని చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు. ఈసందర్భంగా అభిమానులే పెద్ద బలం అని, ఆ బలం ఎంత పెద్దదంటే అంటూ `చరిత్ర సృష్టించాలన్నా మీరే, దాన్ని తిరగరాయాలన్నా మీరే` అని తెలిపారు.
``అఖండ` సినిమాని బాలయ్య బాబు అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు ఆదరించారు. అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఓక మాస్ సినిమాలో నేచర్ గురించి, భగవంతుడు గురించి చెప్పే స్కోప్ వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులోని సందేశం ఆడియెన్స్ కి బాగా నచ్చింది. రాయలసీమ ప్రజలు ఒక సినిమా చూసి నచ్చింది అని అంటే ప్రపంచం మొత్తానికి నచ్చుతుంది. `అఖండ` విషయంలో అదే జరిగింది. బాలయ్యబాబుతో నా జర్నీ జీవితాంతం ఇంతే సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటున్నాని తెలిపారు బోయపాటి.