నెల్లూరు కుర్రాళ్ళు.. చిచ్చర పిడుగులు.. మెచ్చుకున్న అనిల్‌రావిపూడి

By Aithagoni RajuFirst Published Aug 14, 2020, 12:36 PM IST
Highlights

మహేష్‌బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఓ ఫైట్‌ని చిత్రీకరించి ఆకట్టుకున్న నెల్లూరు కుర్రాళ్ళు, దాన్ని మహేష్‌బాబుకి బర్త్ డే గిఫ్ట్ గా అందించారు. తాజాగా మరో ఫైట్‌ని తమదైన స్టయిల్‌లో చిత్రీకరించి విడుదల చేశారు.

సినిమా అనేది ఓ ప్యాషన్‌. దానిపై అభిమానం స్వతహాగా మనసులో ఉండాలి. ఎవరో చెబితే వచ్చేది. అదే సమయంలో ప్రతిభ ఏ ఒక్కరి సొత్తు కాదు. దాన్ని అణచి వేయాలనుకున్నా అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ప్రతిభకి కులం, మతం, ప్రాంతం అడ్డురావు. కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా దాన్ని అణచి వేయలేవు. ఇదే విషయాన్ని నెల్లూరు కుర్రాళ్ళు నిరూపించి చూపించారు. స్మార్ట్ ఫోన్లని కెమెరాలుగా, తమ వద్ద ఉన్న శివారు ప్రాంతాన్నే లొకేషన్‌గా మార్చుకుని, అక్కడి పిల్లలతోనే ఓ వీడియో రూపొందించి అదరగొట్టారు.

ఇటీవల మహేష్‌బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఓ ఫైట్‌ని చిత్రీకరించి ఆకట్టుకున్న నెల్లూరు కుర్రాళ్ళు, దాన్ని మహేష్‌బాబుకి బర్త్ డే గిఫ్ట్ గా అందించారు. తాజాగా మరో ఫైట్‌ని తమదైన స్టయిల్‌లో చిత్రీకరించి విడుదల చేశారు. `సరిలేరు నీకెవ్వరు`లోని బాగా పాపులర్‌ అయిన `రమణ లోడెత్తాలిరా` అనే ఫైట్‌ని షూట్‌ చేశారు. వారే అన్ని తామై ఎడిటింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ చేసుకుని విడుదల చేశారు. తాజాగా లఘు చిత్రాన్ని తలపించే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ వీడియోని దర్శకుడు అనిల్‌ రావిపూడి చూడటం విశేషం. ఆయనతోపాటు ఆ ఫైట్‌ని కంపోజ్‌ చేసిన రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్లు మెచ్చుకున్నారు. 

ఇంతకి ఈ నెల్లూరి కుర్రాళ్ల కథేంటో చూస్తే.. నెల్లూరు శివారు ప్రాంతంలోని భగత్‌ సింగ్‌ కాలనీ, పక్కన ఉన్న జనార్థన్‌ రెడ్డి కాలనీలు రెండూ మురికి వాడలు. అక్కడ కిరణ్‌ అనే 19 ఏళ్ళ కుర్రాడు తమ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువు మానేశాడు. కూలీ పనులతో ఇంటికి సాయపడుతున్నాడు. అయితే అతనికి సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో రాణించాలని, దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. సినిమాల్లోకి వెళ్లే వయసు, తాను సొంతంగా తీసే స్థోమత లేదు.

కానీ తన టాలెంట్‌కి పదును పెట్టాడు. తమ కాలనీల్లోనే ఉండే కుర్రాళ్ళని, స్నేహితులను ఏకం చేశాడు. మహేష్‌బాబుపై ఉన్న అభిమానంతో ఆయనకు ఓ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సినిమాలోని కొండారెడ్డి బురుజు వద్ద తీసిన ఫైట్‌ని తమ కుర్రాళ్ళతో చిత్రీకరించాడు. ఇందులో మున్నా అనే కుర్రాడు మహేష్‌ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. విలన్‌తో పోరాట సన్నివేశాన్ని అచ్చుగుద్దినట్టు తీసి మెప్పించారు. దీన్ని ఇటీవల మహేష్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు గిఫ్ట్ ఇచ్చారు.  

అంతటితో ఆగలేదు. మరో పాపులర్‌ ఫైట్‌ `రమణ లోడెత్తాలిరా` ఫైట్‌ని అద్బుతంగా చిత్రీకరించారు. ఇందులో చాలా వరకు అందరు పదేళ్ళ లోపు చిన్నారులే కావడం విశేషం. లఘు చిత్రం మాదిరిగా ఉన్న ఈ వీడియో సైతం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీరి ప్రతిభను ఏకంగా `సరిలేరు నీకెవ్వరు` దర్శకుడు అనిల్‌ రావిపూడి, ఫైట్‌మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ మెచ్చుకోవడం విశేషం. వచ్చి పడుతున్న అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. అద్భుత ప్రతిభతో తెలుగు నాట మార్మోగిపోతున్న సింహపురి చిన్నోళ్లు తమకు వస్తున్న అభినందనలు, ప్రశంసలతో తడిసి ముద్దవుతున్నారు. మున్ముందు మరిన్ని లఘు చిత్రాలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 

మొత్తంగా ప్రతిభ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. మరి ఇది మహేష్‌కి చేరి, వారి ప్రతిభని ఆయన అభినందిస్తే ఇక వారి ఆనందానికి అవదులుండవనే చెప్పాలి. మరి మహేష్‌ వరకు అది చేరుతుందో లేదో చూడాలి. 

click me!