ధర్మయోగి రివ్యూ

Published : Oct 29, 2016, 06:28 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ధర్మయోగి రివ్యూ

సారాంశం

తెలుగు ప్రేక్షకులకు గత కొంత కాలంగా దగ్గరవుతున్న ధనుష్‌ ‘ధర్మయోగి’గా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘త్రీ’, ‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రాలతో ధనుష్‌ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అందుకే ధనుష్‌ చిత్రాలు ఈ మధ్య వరుసగా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. సినిమా బాగుందంటే.. డబ్బింగ్ సినిమా అయినా పట్టం కడతారు తెలుగు ప్రేక్షకులు. అందునా దీవాళీ సీజన్‌లో తెలుగు సినిమాలనుంచి పెద్దగా పోటీ లేకుండా తమిళ సినిమాలు కాష్మోరా, ధర్మయోగి బరిలోకి దిగాయి. కాష్మోరా ఒక రోజు ముందే వచ్చి మంచి చాక్ సంపాదించింది. మరి ‘ధర్మయోగి’ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో...

తెలుగు ప్రేక్షకులకు గత కొంత కాలంగా దగ్గరవుతున్న ధనుష్‌ ‘ధర్మయోగి’గా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘త్రీ’, ‘రఘువరన్‌ బి.టెక్‌’ చిత్రాలతో ధనుష్‌ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అందుకే ధనుష్‌ చిత్రాలు ఈ మధ్య వరుసగా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. సినిమా బాగుందంటే.. డబ్బింగ్ సినిమా అయినా పట్టం కడతారు తెలుగు ప్రేక్షకులు. అందునా దీవాళీ సీజన్‌లో తెలుగు సినిమాలనుంచి పెద్దగా పోటీ లేకుండా తమిళ సినిమాలు కాష్మోరా, ధర్మయోగి బరిలోకి దిగాయి. కాష్మోరా ఒక రోజు ముందే వచ్చి మంచి చాక్ సంపాదించింది. మరి ‘ధర్మయోగి’ ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో...

కథ: ధర్మ, యోగి (ధనుష్‌) కవల పిల్లలు. ధర్మకి బుద్ధిబలం ఎక్కువ. యోగి మొండివాడు. చిన్నప్పట్నుంచే తండ్రితో తిరుగుతూ రాజకీయాలపై మమకారం పెంచుకొంటాడు యోగి. ధర్మ మాత్రం బాగా చదువుకొని కళాశాలలో అధ్యాపకుడు అవుతాడు. బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో వూహించని రీతిలో ప్రజాస్వామ్య పార్టీ తరపున యోగికి ఎమ్మెల్యే టిక్కెట్‌ లభిస్తుంది. అధికారంలో ఉన్న ప్రగతిశీల పార్టీ తరపున యోగి ప్రియురాలు అయిన అగ్నిపూల రుద్ర (త్రిష)కి టికెట్టు వస్తుంది. ప్రేయసి, ప్రియుడు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇంతలో యోగి హత్యకి గురవుతాడు. ఆ హత్య చేసిందెవరు? యోగి హత్య తర్వాత రుద్ర ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఏం చేసింది? యోగి హత్యకి కారకులైన వాళ్లకి ఎవరు శిక్ష విధించారు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.

కథనం-విశ్లేషణ: ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఒక పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇదే కథలో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితమైంది. అధికారం కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తులు, పైఎత్తులు ఇదివరకు చాలా సినిమాల్లోనే చూశాం. ఇది కూడా ఆ బాపతు కథే. కాకపోతే ఓ యువజంట నేపథ్యంలో ఆ కథని తీర్చిదిద్దడమే ఇందులో కొత్తదనం. బలహీనుడైన ఓ తమ్ముడు అన్న చనిపోయాక మొండివాడిగా ఎలా మారాడు? అన్న ఆశయాన్ని ఎలా నెర వేర్చాడనే అంశం కూడా ఇందులో కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కథంతా ధర్మ, అతడిని ఇష్టపడే అమ్మాయి మాలతి (అనుపమ)ల పరిచయం, ప్రేమ.... అలాగే యోగి, ఆయన ప్రియురాలైన అగ్నిపూల రుద్రల ప్రేమాయణం, రాజకీయ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల చుట్టూనే సాగుతుంది. మధ్యమధ్యలో పార్టీ ఆఫీసులు, రాజకీయ పరిణామాలతో సన్నివేశాలన్నీ సున్నితంగానే సాగిపోతాయి.

విరామానికి ముందు నుంచే కథలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటాయి. అప్పటికప్పుడు యోగిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, అదే సమయంలో అవతలి పార్టీ నుంచి కూడా అగ్నిపూల రుద్ర కూడా బరిలోకి దిగుతుండటంతో కథ రక్తి కడుతుంది. ప్రేమలో ఉన్న ఓ జంట పోటీ పడుతుండటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు ద్వితీయార్ధంలో బోలెడంత డ్రామా ఉండేలా చూసుకొన్నాడు.

అయితే ఆ డ్రామా కొన్నిసార్లు ప్రేక్షకులని గందరగోళంలోకి నెట్టేసే స్థాయికి వెళ్లింది. ఒక పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉండటం, అసలు ఎవరు ఏ పార్టీకి చెందినవారో, ఎవరు ఎవరెవర్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటారో అర్థం కాదు. కానీ ఈ రకమైన కథని ఓ ప్రేమజంట నేపథ్యంలో తెరకెక్కించడం మాత్రం ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచుతుంది. ముఖ్యంగా రుద్ర వేసే ఎత్తులు, ఆమె ఎంపీగా ఎన్నికయ్యే విధానం మంచి డ్రామాని పండిస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం కొత్తదనం లోపించింది.

నటన : ధనుష్‌ వన్‌ మేన్‌ షో చేశాడని చెప్పొచ్చు. రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయాడు. వాటి మధ్య తేడాని కూడా చక్కగా చూపించాడు. త్రిష కూడా చాలా రోజుల తర్వాత ఒక బలమైన పాత్రలో కనిపించింది. భవిష్యత్తులో ఆమె కోసం రుద్రలాంటి పాత్రలు విరివిగా సిద్ధం కావొచ్చు. అనుపమ పరమేశ్వరన్‌ పాత్ర తొలి సగభాగానికే పరిమితమైంది. ద్వితీయార్ధంలో కథంతా పొలిటికల్‌ డ్రామా చుట్టూనే సాగడంతో ధర్మ, మాలతీల ప్రేమాయణానికి చోటు లేకుండా పోయింది. ప్రజాస్వామ్య పార్టీ అధినేతగా కథానాయకుడు విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖరన్‌ నటన మెప్పిస్తుంది. కాళి వెంకట్‌, కరుణాస్‌, శరణ్యలు వారి పాత్రల పరిధికి తగ్గట్టుగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సాంకేతికంగా కూడా సినిమా బలంగా ఉంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం, వెంకటేష్‌ ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. నిర్మాణం పరంగా మాత్రం తెరపై లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా తెరపై కనిపించే పోస్టర్లలోనూ, బ్యానర్లపైన తెలుగు పేర్లు అటు ఇటూ కదులుతూ ఉంటాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ విషయంలో హడావుడి పడినదంతా తెరపై స్పష్టంగా కనిపిస్తుంటుంది. దర్శకుడు దురై సెంథిల్‌కుమార్‌ యువతరం నేపథ్యంలో పొలిటికల్‌ డ్రామా కథని తెరకెక్కించడం కొత్త ఆలోచన దానిని ప్రశంసించాల్సిందే. అయితే ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలపై మరింత కసరత్తులు చేయాల్సింది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపిస్తుంటాయి.

బలం- కథా నేపథ్యం, ధనుష్‌, త్రిషల నటన

బలహీనతలు- సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు

చివరిగా: రాజకీయంపై ఆసక్తి కాస్త ఉన్నా ‘ధర్మయోగి’ నచ్చుతుంది.

రేటింగ్- 3/5

PREV
click me!

Recommended Stories

Supritha: ఎంట్రీతోనే భయపెట్టబోతున్న సురేఖ వాణి కూతురు.. ఎస్తర్‌, సుప్రీత, ధన్య కలిసి హర్రర్‌ మూవీ
Jr Ntr కి రెండో సారి హ్యాండిచ్చిన త్రివిక్రమ్‌.. తారక్‌కే ఎందుకిలా జరుగుతుంది?