మరణానికి ముందు దాసరి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్నారా?

First Published Jun 8, 2017, 5:50 PM IST
Highlights
  • దాసరి మరణానికి ముందు కొలిక్కిరాని ఆర్థిక లావాదేవీలు
  • పలు ఆస్థులు, అప్పులకు సంబంధించి కొలిక్కిరాని లావాదేవీలు
  • నివాసం ఉంటున్న ఇంటినీ అప్పు కోసం తాకట్టు పెట్టిన దాసరి

దర్శక రత్న దాసరి నారాయణరావు అంటే తెలుగు సినిమా పరిశ్రమలోనే కాక భారతీయ సినిమా రంగంలో ఓ దిక్చూచి లాంటి వారు. కెరీర్‌లో వరుసగా డజనుకుపైగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన ఘనత ఉంది.దాసరి కోసం డజన్ల కొద్ది నిర్మాతలు ఆయన వస్తున్నారని తెలియగానే ఎయిర్‌పోర్ట్‌ లో క్యూ కట్టేవారట. సినిమా ఓకే అంటే చాలు.. బ్లాంక్ చెక్కులు ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉండేవారట. అలా ఓ వెలుగు వెలిగిన దాసరి చివరి రోజులు చాలా దారుణంగా ముగిసిపోయాయి. సినిమా రంగంలో తను నా వాళ్లు అనుకొన్న వాళ్లు కూడా దాసరి మరణం తర్వాత ముఖం చాటేశారు.  చివరకు దూరంగా పెట్టిన కుటుంబమే ఆయనకు అండగా మిగిలింది. ప్రస్తుతం వివాదాల్లో కూరుకుపోయిన ఆస్తులను, ఆర్థిక లావాదేవీలను సన్నిహితులు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

 

ఇటీవల కాలంలో తన సంపాదనలో చాలా భాగం ఇతరులకు సర్దుబాటు చేశారని, మరికొంత ఫైనాన్షియర్లకు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. వాటికి లెక్కా పత్రం కూడా లేకపోవడం వల్ల ఆ మొత్తాలు వస్తాయో రాయో అనే అయోమయం నెలకొందట. అంతేకాకుండా తీసుకున్న వాళ్లు కూడా గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారని తెలుస్తోంది. అలా తీసుకున్న వారిలో ఓ ప్రముఖ నిర్మాత, మరో ఫైనాన్షియర్ వున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఉండగా, సీబీఐ కేసులు, ఇతర తగాదాల కారణంగా దాసరి ఆస్తులన్నీ ఏదో ఓ సమస్యలో కూరుకుపోయాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.

 

దర్శకరత్న మరణించేంత వరకు నివసించిన నివాసంపై కూడా అప్పు ఉందట. హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో ఉన్న అపార్ట్ మెంట్లు, ఆస్తులు అటాచ్‌మెంట్ ల్లో వున్నాయట. అలాంటి ఆస్తులన్నీ ఓ కొలిక్కి రావడానికి చాలా టైమ్ పడుతుందనేది తాజా సమాచారం. తాను నివసించే ఇంటిపై దాసరి అప్పు తీసుకోవడానికి కారణం నెలవారీ ఖర్చుల ప్రభావమే అని తెలుస్తున్నది.

 

ప్రతి నెల దాసరి ఇంటి మెయింటెనెన్స్ ఖర్చు సుమారు రూ.30 లక్షల వరకు ఉంటుందని సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రతి నిమిషం ఇళ్లంతా బోలెడు ఏసీలు రన్ అవుతాయట. దాంతో భారీగా కరెంట్ బిల్లు వచ్చేదట. ఇక తన ఆఫీసు నిండా భోజనాల సమయంలో కనీసం రెండు డజన్ల మంది వుండేవారట. ఆయన ఉన్నన్ని రోజులు ఆఫీస్ కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించేందని ఆయన సన్నిహితులు కొందరు గుర్తు చేసుకొంటున్నారు. తనను కలువడానికి, ఆఫీస్ పనుల నిమిత్తం వచ్చిన వారికి కాఫీ, టీ, భోజనం లాంటి వాటితో దాసరి సకల మర్యాదలు చేసేవారట. ఆదాయానికి మించి ఖర్చు ఉంటున్నా నా వాళ్లకే పెడుతున్నా కదా అనే భావనలో ఉండేవారట.

బయటి వ్యక్తులకు ఇచ్చి డబ్బు సమయానికి చేతికి అందక, ఇంటిపై అప్పుతెచ్చారని వార్త ఫిలింనగర్‌లో సర్కులేట్ అవుతున్నది. ప్రస్తుతం దాసరి లేకున్నా, ఆయన సన్నిహితులు ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దే పనిలో వున్నారు. వైద్య చికిత్స కోసం తొలిసారి హాస్పిటల్‌ వెళ్లడానికి ముందే దాసరి తన సన్నిహితుల ద్వారా కొన్ని ఆర్థిక లావాదేవీలు చక్క బెట్టే ప్రయత్నం చేసారట. వాటిలో కొన్ని ఓ కొలిక్కిరాగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. ఇంతలోనే దాసరి మరణించడంతో పలు ఆర్థిక లావాదేవీల వ్యవహారం ప్రశ్నార్థకంగా మారిందని సమాచారం.

click me!