సుకుమార్ శిష్యుడు, ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇలా ఉన్నాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తొలిచిత్రం ‘దసరా’తోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ సినిమా ఎవరితో అనే చర్చ నడుస్తోంది. మళ్లీ ఎలాంటి ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదే ఆయన పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ దర్శకుడు ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ‘పుష్ప2’ చిత్ర షూటింగ్ కు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ ను ముగియడంతో నేరుగా తమ సొంత జిల్లా కరీంనగర్ కు బయల్దేరినట్టు సమాచారం. ఇక పెళ్లి కూడా కరీంనగర్ లోనే ఉంటుందంటున్నారు. ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. త్వరలో వచ్చే అవకాశం ఉంది.
ఇక శ్రీకాంత్ చాలా సింపుల్ గా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితుల నుంచి సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అతికొద్ది మంది అథితులతో జరగనుందని తెలుస్తోంది. ఈయన వెడ్డింగ్ కు గెస్ట్ లుగా గురువు సుకుమార్, ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు రానున్నట్టు తెలుస్తోంది. అలాగే నాని, కీర్తి సురేష్ సహా ‘దసరా’ టీమ్ కూడా హాజరవుతుందని అంటున్నారు. ‘దసరా’తో మంచి దర్శకుడిగా ఎస్టాబ్లిష్ కావడంతో ఇక పర్సనల్ లైఫ్ లోనూ సెటిల్ అవుతున్నాడని అంటున్నారు.