`భోళా శంకర్` నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(సతీష్) తనని నిర్మాతలు మోసం చేశారని, నమ్మకద్రోహం చేశారంటూ ఆయన కోర్ట్ మెట్లు ఎక్కారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన `భోళా శంకర్` చిత్రం గత నెలలో విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత నిరాశ పరిచిన మూవీగా `భోళాశంకర్` నిలిచింది. ఈ సినిమాతో నిర్మాత అనిల్ సుంకర కోట్లు నష్టపోయారు. యాభై కోట్లకుపైగానే నష్టం వాటిల్లిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాని కొన్ని డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టపోయారు. కొందరు డిస్ట్రిబ్యూటర్ అప్పుడే తిరగబడగా, ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
తాజాగా `భోళా శంకర్` నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(సతీష్) తనని నిర్మాతలు మోసం చేశారని, నమ్మకద్రోహం చేశారంటూ ఆయన కోర్ట్ మెట్లు ఎక్కారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు చీటింగ్ తో పాటు వివిధ కేసులు పెట్టారు. అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని, ఆ సినిమాకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి మూడు రాష్ట్రాల హక్కుల కోసం 30 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ ను బ్యాంకు ద్వారా తాను చెల్లించానని, కానీ తనకు కేవలం విశాఖపట్నం హక్కులను మాత్రమే ఇచ్చారని శనివారం డిస్ట్రిబ్యూటర్ సతీష్ వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో తాను నిర్మాతలను సంప్రదించగా, 'భోళా శంకర్" సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారని, ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం ఇన్నాళ్లు తాను ఫోర్స్ చేయలేదని, కానీ కనీసం తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడనే నేపథ్యంలో తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించినట్టు చెప్పింది. నేను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని , ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నామని సతీష్ చెప్పారు.
సతీష్ తరఫు అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ, బత్తుల సత్యనారాయణను మోసం చేసిన వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసులకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయని, సదరు నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేసుకోమని కోర్టు చెప్పిందని ఆయన తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, ఇంకా వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు. సతీష్‌కి తన సపోర్ట్ ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడతామని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు.
ఇక చిరంజీవి హీరోగా, తమన్నా కథానాయికగా కీర్తిసురేష్ సిస్టర్ పాత్రలో నటించిన `భోళా శంకర్` చిత్రానికి మెహెర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులు. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదలైంది. ప్రారంభ ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఒక్కరోజులోనే కుప్పకూలిపోయింది.