కొన్ని కాంబినేషన్స్ కి పిచ్చ క్రేజ్ ఉంటుంది. ఆ ఇద్దరూ జతకడితే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్స్ లో ఎన్టీఆర్-సాయి పల్లవి ఒకటి. ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్, యాక్టర్స్ అయిన వీరిద్దరూ కలిసి ఓ మూవీ చేయాలని సినిమా ప్రేమికులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు.
ఆ కల సాకారమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్న కథనాలు పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఎన్టీఆర్ (NTR) తన నెక్స్ట్ మూవీ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన జరిగిన నేపథ్యంలో త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)కోసం ఎన్టీఆర్, ఆచార్య కోసం కొరటాల శివ నాలుగేళ్లు కేటాయించారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ త్వరిత గతిన పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
కాగా ఎన్టీఆర్ 30 (NTR 30) హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి బాలీవుడ్ లో స్టార్ హోదా కలిగిన అలియా బెటర్ ఛాయిస్ గా దర్శకుడు కొరటాల భావించారు. అయితే అనుకోకుండా అలియా భట్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారట. కారణం ఏదైనా అలియా భట్... ఎన్టీఆర్-కొరటాల చిత్రం చేయడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. దీంతో కొరటాల శివ హీరోయిన్ రష్మిక మందానను సంప్రదించారట. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న రష్మిక నెక్స్ట్ బెస్ట్ అనే ఆలోచన చేస్తున్నారట.
కాగా అనూహ్యంగా సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ 30 కోసం సాయి పల్లవి(Sai Pallavi)ని అనుకుంటున్నారట. అన్నీ కుదిరితే ఆమె ఎన్టీఆర్ తో జతకట్టడం లాంఛనమేనన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే నిజమైతే ఫ్యాన్స్ పండగ చేసుకున్నట్లే. ఎన్టీఆర్-సాయి పల్లవిపై తెరకెక్కే డ్యూయెట్స్ వెండితెరపై ఏ రేంజ్ లో పేలుతాయో ఊహించుకోవడం కూడా కష్టమే. మరోవైపు సాయి పల్లవి కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. ఆమె పెళ్ళికి సిద్ధమయ్యారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో హీరో ఎవరైనా... పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఆమె చేయరు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను నమ్మలేం. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే... ఈ క్రమంలో ఆ రోజు స్పష్టత రానుంది.