
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలని అటు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుతం పవన్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించింది.
ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే త్వరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం కూడా షురూ కాబోతోంది. ఇదిలా ఉండగా సారధి స్టూడియోలో ఆసక్తికర సంఘటన జరిగింది. యంగ్ కమెడియన్ ప్రియదర్శి.. పవన్ కళ్యాణ్ ని కలిశారు. దీనితో ప్రియదర్శి తన సంతోషాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు.
ఎప్పటిలాగ సారధి స్టూడియోలో షూటింగకి వెళ్ళాను, కానీ ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసిన హడావిడి, అందరి కళ్ళలో ఏదో సందడి, అందరి నోట్లో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అంతే! వారితో ఒక మాటైనా మాట్లాడాలి, వారు తీసిన చిత్రం 'జానీ' ఎంతగా నచ్చిందో చెప్పడానికి రోజంతా ఎదురుచూశాను! హరీష్ శంకర్ అన్న వల్ల ఆ కోరిక తీరింది, నీకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్న! కళ్యాణ్ గార్ని కలిసి మాట్లాడడం ఒక మర్చిపోలేని అనుభూతి.. అంటూ ప్రియదర్శి ట్వీట్ చేసాడు. పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ లతో దిగిన ఫోటోలని షేర్ చేశాడు.
పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆ చిత్రానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. జానీ పవన్ కెరీర్ లోనే ప్రత్యేక సినిమాగా చెబుతుంటారు. బహుశా ప్రియదర్శి కూడా అలాంటి అభిమానే ఏమో.
ఇక పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరూ సరదా స్టూడియోకి ఎందుకు వెళ్లారు అనే చర్చ జరుగుతోంది. భవదీయుడు.. చిత్రానికి సంబంధించిన వర్క్ మొదలయిందా లేక... పవన్ హరిహర వీరమల్లుతో బిజీగా ఉంటే హరీష్ అక్కడికి వెళ్ళారా అనేది తెలియాల్సి ఉంది.