Kiraak RP: చేపల పులుసు కర్రీ పాయింట్‌ని మూసేసిన కిర్రాక్‌ ఆర్పీ.. ఏం జరిగిందంటే?

By Aithagoni RajuFirst Published Jan 2, 2023, 4:02 PM IST
Highlights

వంటకాలు తక్కువ, జనం ఎక్కువ కావడంతో సరైన సమయంలో పార్సెల్‌ చేయలేకపోతున్నారు. ఈ నిర్వాహణ కష్టంగా మారిన నేపథ్యంలో కిర్రాక్‌ ఆర్పీ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు kiraak rp.

జబర్దస్త్ షోతో పాపులర్‌ అయ్యారు `కిర్రాక్‌` ఆర్పీ.. ఈ షోలోని తన టీమ్‌ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. చాలా రోజుల క్రితమే షోకి దూరమయ్యాడు ఆర్పీ. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో ఓ కర్రీ పాయింట్‌ని స్టార్ట్ చేశారు. `నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు` పేరుతో కొత్తగా కర్రీ పాయింట్‌ని ఓపెన్‌ చేశారు. అయితే కిర్రాక్‌ ఆర్పీకి మంచి ఫాలోయింగ్‌ ఉండటంతో బాగా ప్రచారం జరిగింది. విశేష ఆదరణ దక్కింది.

ప్రారంభం రోజు నుంచే జనాలు కర్రీస్‌ కోసం క్యూ కట్టారు. కర్రీ పాయింట్‌కి ఆదరణ బాగా పెరిగింది. షాప్‌కి కస్టమర్ల తాకిడి పెరగడంతో సమీపంలో ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయ్యింది. ఊహించని విధంగా దూర ప్రాంతాల నుంచి కూడా జనం వచ్చి ఇక్కడి చేపల పులుసు కర్రీ తీసుకెళ్తున్నారు. అయితే ఆదరణ పెరగడం, తాకిడి ఎక్కువ కావడంతో వారికి సరిపడ కర్రీస్‌ని ప్రీపేర్‌ చేయలేకపోతున్నారు సిబ్బంది. 

వంటకాలు తక్కువ, జనం ఎక్కువ కావడంతో సరైన సమయంలో పార్సెల్‌ చేయలేకపోతున్నారు. ఈ నిర్వాహణ కష్టంగా మారిన నేపథ్యంలో కిర్రాక్‌ ఆర్పీ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. కర్రీ పాయింట్‌ని క్లోజ్‌ చేశాడు. కొత్త ఏడాది సందర్భంగా కస్టమర్లకి షాకిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌కి జనం తాకిడి ఎక్కువయ్యింది. చాలా దూరం నుంచి జనం వస్తున్నారు. వారికి సరైన సమయంలో కూరలు అందించలేకపోతున్నాం. అందుకే ప్రారంభించిన నెల రోజులకే షాప్‌ క్లోజ్‌ చేయాల్సి వచ్చింది. ముందుగా కిచెన్ కెపాసిటీని పెంచి షాప్‌లో మార్పులు చేయాల్సి ఉంది. ఆ తర్వాతనే కర్రీ పాయింట్‌ని తిరిగి ఓపెన్‌ చేస్తాం అని వెల్లడించారు.

అయితే షాప్‌ క్లోజ్‌ అయ్యిందనే విషయం తెలియక జనాలు ఇంకా వస్తున్నారని, వారికి క్షమాపణలు చెబుతూ, దయజేసి ఈ విషయాన్ని గమనించాలన్నారు. అంతేకాదు నెల్లూరు చేపల పులుసు బాగా వండే మహిళలను తీసుకొచ్చి వారితో వండిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందట. అందుకే నెల్లూరులో ఆడిషన్స్ పెట్టి బాగా వండే మహిళలను సిటీకి తీసుకొస్తానని, త్వరలోనే భారీ స్థాయిలో కర్రీ పాయింట్‌ ఓపెన్‌ చేస్తానని తెలిపారు ఆర్పీ. ఇదిలా ఉంటే కిర్రాక్‌ ఆర్పీ దర్శకుడిగా మారుతున్నారు. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్‌లో ఓ సినిమాని రూపొందిస్తున్నారు.  ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది.
 

click me!