
ప్రముఖ సినీ నటుడు చిరంజీవి (Chirajeevi) మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో (YS Jagan) కలవనున్నారు. ఈసారి చిరంజీవితో పాటు మరికొందరు టాలీవుడ్ (Tollywood) పెద్దలు కూడా సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సమావేశం జరగనుంది. తెలుగు సినీ పరిశ్రమంలో సమస్యలు, టికెట్ ధరలపై సీఎం జగన్‌తో సినీ పెద్దలు చర్చలు జరపనున్నారు.
ఇదిలా ఉంటే సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మంగళవారం భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో గత నెలలో సీఎం జగన్‌తో తాను భేటీ అయిన సందర్భంగా చర్చించిన విషయాలను చిరంజీవి.. సినీ ప్రముఖులకు వివరించనున్నారు. అంతేకాకుండా 10వ తేదీన భేటీలో సీఎం జగన్‌తో చర్చించాల్సిన విషయాలపై సినీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు.
అయితే సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో మావీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారని.. ఏపీలో తగ్గించారని చెప్పారు. సినిమా టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందకెళ్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయని అన్నారు. చిరంజీవి, సీఎం జగన్ మీటింగ్‌కు సంబంధఇంచి మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన మంచు విష్ణు.. పర్సనల్ మీటింగ్‌ను అసోసియేషన్ మీటింగ్‌గా భావించకూడదని అన్నారు. సినీ ఇండస్ట్రీ అంతా పెద్ద కుటుంబం అని చెప్పారు.
సినిమా టికెట్ల ధరలు తగ్గించింది కరెక్టా..?, పెంచింది కరెక్టా..? అనేది లాంగ్ డిబేట్ అని అన్నారు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నాయని తెలిపారు. తాను విడిగా మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించలేనని చెప్పారు. ఇండస్ట్రీ ఒక్కరిది కాదని.. ప్రతి ఒక్కరిది అని అన్నారు.
ఇక, గత నెలలో జగన్‌తో భేటీ అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ సమస్యలపై మాట్లాడేందుకు తాను సీఎం పిలుపుమేరకు వచ్చి కలిసినట్టుగా చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించానని తెలిపారు. సినీ పరిశ్రమకు ఒక బిడ్డగానే తానిక్కడికి వచ్చానని అన్నారు. సీఎం సానుకూలంగా తాను చెప్పిన సమస్యలను విన్నారని.. తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉంటుందని చెప్పారు. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. సీఎం జగన్ తన ఒక్కడినే ఆహ్వానించినందునే ఒక్కడినే వచ్చానని చిరంజీవి స్పష్టం చేశారు. త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి జగన్‌ను కలుస్తున్నానని చిరంజీవి చెప్పారు.
అయితే ఆ మరుసటి రోజే చిరంజీవికి రాజ్యసభ అంటూ కూడా ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే చిరంజీవి వాటిని ఖండించారు. తాను రాజకీయాలకు దూరం అని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఎవరూ కూడా ఈ రకమైణ పదవులను ఆఫర్ చేయబోరని చిరంజీవి అభిప్రాయపడ్డారు. రాజకీయ పదవుల కోసం జరిగే ప్రచారంపై తాను సమాధానం చెప్పబోనని చిరంజీవి తేల్చేశారు. రాజకీయ పదవుల కోసం లోబడడం కానీ, అలాంటి వాటిని కోరుకోవడం కూడా తన అభిమతం కాదని చిరంజీవి స్పష్టం చేశారు.